కట్టా శేఖర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదా సోమవారం శాసనసభ ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించడం తప్పనిసరవుతుంది. బిల్లు కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి నివేదించింది. ఆ బిల్లును వెనుకకు తెప్పించుకునే బాధ్యత, కేంద్ర ప్రభుత్వం పరువు నిలుపుకునే బాధ్యత కాంగ్రెస్‌దే. తెలంగాణవాదులెవరూ నిరాశకు లోనుకావద్దు. ఆవేశపడవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెస్, యూపీఏ, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత. బిల్లును గౌరవించకపోతే ఏం చేయాలో కూడా కేంద్రానికి తెలుసు.
ఇప్పటివరకు కేంద్రం అన్ని పద్దతులు పాటిస్తూ వచ్చింది. అన్ని పార్టీల లేఖలు, శ్రీకృష్ణకమిటీ నివేదిక, అఖిలపక్షం తీర్మానం అన్నీ కేంద్రం వద్ద ఉన్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన ఐదవ పరిష్కారాన్నే కేంద్రం ఎంచుకుంది. చర్చకు, సంప్రదింపులకు, రాజ్యాంగ విధివిధానాలకు అనుగుణంగానే బిల్లును ఇక్కడికి పంపింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఆదేశాలను ధిక్కరిస్తే ఏం జరుగుతుందో గతానుభవాలు ఉండనే ఉన్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రిని డస్మిస్ చేసి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా కేంద్రం అందుకు వెనుకాడదు. ఇది కేంద్రం ప్రతిష్ఠకు సంబంధించిన సమస్య.