టివి9, ఎబిఎన్‌ల ప్రసారాల నిలిపివేతపై ఆశించినంతగ మేధావుల నుండి స్పందన రానందుకు ఎబిఎన్ అధినేత రాధాక్రిష్ణ ఖిన్నుడైనట్టున్నారు.
ఇదేనా ప్రజాస్వామ్య తెలంగాణ? ఇందుకేనా తెలంగాణ కోసం పోరాడింది? అని తన బాధను లోకం బాధగ చెప్పే ప్రయత్నం చేసినా, పెద్దగా ఫలితం కల్గినట్టులేదు.
అయినా, ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరెంతగా పాటుపడిందీ…, పిడికెడు గుత్తేదార్ల కొమ్ముకాస్తూ, కోట్లాది ప్రజల ఆశలపై ఎట్లా నీళ్ళు చల్లడానికి ప్రయత్నించిందీ…, తెలంగాణ వాదమే లేదనీ, తెలంగాణ రానే రాదనీ, రెచ్చగొట్టి, వందల విద్యార్థుల ఆత్మహత్యలకు ఎట్లా కారణమైందీ…, ఇంకా ఏ మేధావి మరవలేదు. అవి ఇప్పట్లో మరిచేవి కావు.
నిజానికి, ఈ చైతన్యం మీ చలవే!. నాలుగున్నరేళ్ళక్రితం తెలంగాణ ప్రకటించబడినప్పుడు, ప్రజాస్వామ్యమంటే ఏమిటో, అందులో మీడియా పాత్ర ఎట్లుండాలో, మీరు గనక చూపించకపోయుంటే, ఒక సగటు మనిషికి ఈ రాజకీయాలు అర్థం అయ్యేవి కావు, తన వాడెవడో…, తనతోనే ఉండి గోతులు తీసే వాడెవడో… తెలిసేదీ కాదు.
ఆయినా ఇప్పుడు బాదపడి ఏంలాభం రాధాక్రిష్ణగారు? మహానది లాంటి తెలంగాణ ఉద్యమంలో, ఏ పిల్లకాలువను పట్టుకొనివచ్చి కలిసినా, ఈరోజు మీరిట్ల ఏకాకి అయ్యే పరిస్థితి వచ్చేదికాదు.
ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు తమను తాము కాల్చుకొని బూడిదైతున్నప్పుడు, వారు పడిన వేదనలో వెయ్యోవంతు అర్థం చేసుకొని ఉంటే… జీవనదులు పారుతున్న ప్రాంతం త్రాగునీటికి కరువైన పరిస్థితిని ప్రశ్నించి ఉంటే… క్రింది ఈ-మెయిల్ లాంటి వందల వేల ఫిర్యాదులు అందినప్పుడు, స్పృహ కలిగి మసులుకొని ఉంటే…
ఈరోజు మిమ్మల్ని అయ్యో అనేవారే!. మీతో కలిసి నడిచేవారే!!.
ఆందుకే ఇది మీ స్వయంకృతాపరాధమే!.