రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయం సీ బ్లాకులో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ అనేది చాలా సాధారణ వైరస్ అని, దీనిపై ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, మీడియా కలిసి ప్రజల్లో చైతన్యం కల్పించాలని, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి ఒక యుద్ధంలాగా చేయాలని, వైరస్ ను తరిమికొట్టాలని సీఎం చెప్పారు. అంతకుముందు నగరానికి చెందిన పలు కార్పొరేట్ హాస్పిటళ్ళ ప్రతినిధులు, వైద్యులతో కూడా సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి స్వైన్ ఫ్లూ వైరస్ పై చర్చించారు.
బుధవారం ఉదయం ఈ విషయంపై ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడానని, కేంద్రం సహకారాన్ని కోరానని సీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వారు తెలిపారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఇందుకు కావాల్సిన వైద్యం, ఇతర విషయాల్లో సహాయం చేస్తామని ప్రధాని, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని కేసీఆర్ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు ఉపయోగించే టామీఫ్లూ గోళీలు మనదగ్గర 16 వేలు మాత్రమే ఉన్నాయని, మరో 40-50 వేల గోళీలు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, వారు సానుకూలంగా స్పందించి 50 వేల టామీఫ్లూ గోళీలు, సిరప్ లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు.