శాసనమండలి చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారంకు నామినేషన్ పత్రాలను అందజేశారు. స్వామిగౌడ్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీ కేకే, మంత్రులు నాయిని, ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితోపాటు ఎంఐఎం ఎమ్మెల్సీలు కూడా పాల్గొని టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. బుధవారం జరగనున్న మండలి సమావేశంలో సభ్యులు కౌన్సిల్ చైర్మన్ ను ఎన్నుకోనున్నారు.
అనంతరం స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడుతూ, తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నానన్నారు. అమరుల త్యాగఫలితమే తెలంగాణ అని, తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ కృషి మరువలేనిదని ప్రశంసించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే మండలి చైర్మన్ పదవికి నామినేషన్ వేశానని, తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు. తనను ఎన్నుకుంటే శాసనమండలి హుందాతనాన్ని మరింతగా పెంచుతానని, మండలి చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేసి మన మధ్య ఐక్యతను చాటాలని అన్ని పార్టీలను కోరానన్నారు.