mt_logo

స్వచ్ఛ భారత్.. సిద్దిపేటకు పాతమాటే!

స్వచ్ఛ భారత్ పేరుతో పరిపూర్ణ పారిశుద్ధ్య భారత నిర్మాణానికి ఇవాళ పిలుపు ఇచ్చి ఉండవచ్చు. కానీ.. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఈ కార్యక్రమం ఎప్పుడో నూటికి నూరుశాతం అమలు జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధించుకున్న పట్టణం ఇదొక్కటే కావచ్చు. ప్రతి ఇంటినుంచి పద్ధతి ప్రకారం చెత్త సేకరించి డంపింగ్ యార్డులకు తరలించే పట్టణం ఇదే కావచ్చు.. రోడ్లన్నీ పచ్చని చెట్లమయం చేసి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న పట్టణం కూడా ఇదే కావొచ్చు… ఇలా చెప్పుకుంటూ పోతే సిద్దిపేట ఇవాళ దేశానికి పాఠాలు చెప్పగల స్థాయిలో ఉంది. పరిమిత జనసంఖ్య కలిగిన గ్రామాల్లో ఇలాంటివి సాధ్యం అయితే అయి ఉండవచ్చునేమో గానీ.. ఒక మున్సిపాలిటీ స్థాయి నగరంలో ఇలా ప్రజలంతా పచ్చదనం పారిశుద్ధ్యం కోసం కలిసికట్టుగా కృషి జరపడం మాత్రం చాలా అరుదు. సిద్దిపేట పట్టణం క్లీన్ అండ్ గ్రీన్‌లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది.

-పదేండ్ల క్రితమే సంపూర్ణ పారిశుద్ధ్య సాధన
-ప్లాస్టిక్ కవర్ల నిషేధం, పట్టణమంతా చెట్లు
-పారిశుధ్యం అమలులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
-75 గ్రామ పంచాయతీలలో 49కు నిర్మల్ పురస్కార్
పట్టణంలో సుమారు 1,11,390 మంది ఓటర్లు, 20 వేల కుటుంబాలున్నాయి. మున్సిపల్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పట్టణాన్ని చెత్తలేని నగరంగా తీర్చిదిద్దారు. గతంలో ఇబ్బందికి కారణమైన పందులు తొలగించడంతో పరిశుభ్రమైన పట్టణంగా రూపుదిద్దుకున్నది. పందులతోనే జీవనం కొనసాగిస్తున్న 22 కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించారు. ఇండ్లలో చెత్తను బయట పడేయకుండా ఇంటింటికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి పట్టణ శివారులోని డంప్ యార్డులకు తరలిస్తున్నారు.

జనసమర్థం, దుకాణ సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సేకరణ జరుగుతున్నది. పట్టణంలోని అన్ని వర్గాల వ్యాపారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల అనర్థాలను వివరించి వాటిని నిషేధించారు. ప్రస్తుతం సిద్దిపేటలో పకడ్బందీగా ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలవుతున్నది. ప్రజల సౌకర్యార్థం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 7 సులభ్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసి, పెంచే బాధ్యత ఆ ఇంటి వారికే ఇస్తూ దత్తత పత్రాలను స్వీకరించారు. పట్టణంలో కుళాయి నుంచి వృథాగా వెళ్లే నీటిని కూడా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

నిర్మల్ పురస్కార్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం
ఇక ఈ అసెంబ్లీ నియోజకవర్గం తక్కువ తినలేదు. ఈ నియోజక వర్గంలో 75 గ్రామ పంచాయతీలకు 49 గ్రామ పంచాయతీలు నిర్మల్ పురస్కార్ అవార్డును సాధించాయి. మరుగుదొడ్ల నిర్మాణంలో నంగునూరు మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2005 -06లో నిర్మల్ పురస్కార్ గ్రామాల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైతే నాటి నుంచి అన్ని గ్రామాల్లో అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నిర్మల్ పురస్కార్ అవార్డు సాధనలో ప్రథమ స్థానంలో ఆ గ్రామాలు నిలిచాయి.

75 గ్రామ పంచాయతీల్లో 49 పంచాయతీలు నిర్మల్ పురస్కార్ అవార్డు పొందగా మరో 26 గ్రామ పంచాయతీలు అవార్డు సాధన దిశగా పయనిస్తున్నాయి. ఇక మిగిలిన 10 గ్రామ పంచాయతీలు కూడా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. ఇవి కూడా నిర్మల్ పురస్కార్ అవార్డు సాధిస్తే అన్నిగ్రామాలు అవార్డు సాధించిన నియోజక వర్గంగా మారుతుంది.

రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు శాసన సభ్యునిగా ఉన్ననాటి నుంచి నియోజక వర్గంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించేందుకు ప్రజలను చైతన్య పరిచారు. దీనికి ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం నంగునూరు మండలంలో 92 శాతం పూర్తి చేసుకోగా చిన్నకోడూరు, సిద్దిపేట మండలాల్లో 90 శాతం మరుగుదొడ్లు పూర్తయ్యాయి. హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని అమలు చేస్తున్న నియోజకవర్గంగా సిద్దిపేటను తీర్చిదిద్దడంలో సఫలీకృతమయ్యారు.

Source: [నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *