2013 సెప్టెంబర్ లో లాల్ బహదూర్ స్టేడియంలో ఏపీఎన్జీవో ల బహిరంగసభలో జై తెలంగాణ నినాదాలు చేసి మెదక్ జిల్లా కానిస్టేబుళ్ళు శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం ముదిరాజ్ లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. స్టేజీ మీదనున్న వక్తలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం చూసి తట్టుకోలేక జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడంతో సీమాంధ్ర పోలీసులు, సభకు హాజరైన వారు ఒక్కసారిగా దాడిచేసి కొడుతున్నా వారు నినాదాలు చేయడం ఆపలేదు. అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం వీరిపై క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ విధులనుండి సస్పెండ్ చేసింది.
సస్పెన్షన్ కు గురైన వీరిద్దరూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినవెంటనే సీఎం కేసీఆర్ ను కలిసి తమపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరగా ఆయన వెంటనే స్పందించి సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ప్రమోషన్ ఇవ్వాలని డీజీపీ అనురాగ్ శర్మకు సూచించారు. అంతేకాకుండా వీరిద్దరినీ సచివాలయంలోనే నియమించాలని కూడా ఆదేశించారు.
సీఎం ను కలిసిన అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ, ‘తాము చేసిన పనికి ఎంతో గర్వంగా ఉందని, బందోబస్తు కోసం లాల్ బహదూర్ స్టేడియంలో విధుల్లో ఉన్న తమకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు, గజల్ శ్రీనివాస్ లు తెలంగాణపై అవమానకరంగా మాట్లాడటాన్ని సహించలేక వేదిక వద్దకు దూసుకెళ్ళి జై తెలంగాణ అని నినాదం చేశామన్నా’రు.
అక్కడే ఉన్న సీమాంధ్ర పోలీసులు, మరికొందరు తమపై దాడిచేసి వేదిక కిందకు లాక్కెళ్ళి కొట్టారని, అప్పుడు వరంగల్ ఇన్స్‌పెక్టర్ విష్ణుమూర్తి తమను కాపాడారని వివరించారు. ముఖ్యమంత్రి తమపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు ప్రమోషన్ కూడా ఇస్తామని చెప్పడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.