mt_logo

తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి – కేసీఆర్

తెలంగాణను రాబోయే మూడేళ్ళలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం విద్యుత్, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు ఉండరాదని, రాష్ట్రంలో ప్రైవేటు విద్యుత్ కు అవకాశం ఇచ్చేదిలేదని, వచ్చే మూడేళ్ళలో 6000 మెగావాట్ల అదనపు ఉత్పత్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు జెన్ కో కు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని వివరించారు.

తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు వీలుగా బొగ్గు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాస్తున్నట్లు సీఎం చెప్పారు. ఛత్తీస్‌గఢ్ లో మిగులు విద్యుత్తును తెలంగాణకు తెచ్చేందుకు రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నది మీదుగా ట్రాన్స్ మిషన్ లైన్లు ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు సోలార్ విద్యుత్ పై కూడా దృష్టి పెట్టాలని, రూఫ్ టాప్ సోలార్ వినియోగంతో ప్రజలపై ఆర్ధిక భారం తగ్గే అవకాశం ఉందని, వ్యవసాయ రంగ విద్యుత్ అవసరాలకు పూర్తిస్థాయిలో సోలార్ పవర్ తో సాధ్యమయ్యే అంశాలపై స్టడీ చెయ్యాలని ఆదేశించారు.

రైతులు ఎరువులకోసం బాధపడవద్దని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ఎరువులు, విత్తనాల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రావద్దని, అందుకోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 33 శాతం సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు.

తెలంగాణలో అడవుల పరిస్థితి బాగోలేదని, అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులతో పాటు వన్యమృగాల సంరక్షణకు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, దీనికి కారణం అడవులు అంతరించిపోవడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిపోవడం ముఖ్య కారణమని అటవీశాఖ అధికారులతో జరిపిన సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ వాతావరణంలో మార్పు తెచ్చేందుకు రెండు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *