mt_logo

యాచించడం మాని. శాసిద్దాం రా!

By: కె. రామచంద్రా రెడ్డి

పార్లమెంటు మెట్ల మీద దీనంగా వేడుకుంటున్న మీ చిత్రాలు చూసి చూసి మాకు జాలి కలగటం లేదు నాయకులారా. ఆగ్రహం వస్తోంది.

రాజులై మమ్మల్ని ఏలండి అంటే, బానిసలుగానే కొనసాగుతామనే మీ మనస్థితిని చూసి, ఆగ్రహం వస్తోంది.

నిత్యం మా శరీరాలు రక్తసిక్తం చేసుకుని ఉద్యమిస్తున్నా ఇంకా ధైర్యం తెచ్చుకోని మీలాంటి అకశేరుకాలని చూసి ఆగ్రహం వస్తోంది.

మా దేహాలను నిప్పుకణికలు చేసుకొని మాడి మసైపోయినా, మీకు ఆకాంక్షల బలం అర్థం కాకపోవడం చూసి ఆగ్రహం వస్తోంది.

ప్రపంచం ఎరుగని ఒక మహత్తర పోరాటాన్ని నిర్మించి, అనేకానేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడి, ముందుండి మమ్మల్ని నడపమని ముక్కోటి మంది వేడుకుంటున్నా అర్థం చేసుకోని మిమ్మల్ని చూసి ఆగ్రహం వస్తోంది.

మా కోసం పోరాడండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పూజలుచేస్తాం అని ఇంతమందిమి అడుగుతున్నా మీరు పోయి ఉలకని పలకని మీ దేవత కాళ్ల దగ్గరే సాగిలపడటం చూసి అవమాన పడుతున్నాం నాయకులారా.

పౌరుషానికి ప్రతీకలైన తెలంగాణ ప్రజలు, ఔరంగజేబునుండి ఇందిరాగాంధీ వరకూ ఎన్నడూ డిల్లీ పాలకుల ముందు తల వంచలేదు.

భూమి, భుక్తి, విముక్తి కోసం నాగలి పట్టే రైతన్నలు బందూకులు పట్టి పోరాడిన నేల ఇది. ఆ నేలను, దాని పోరాటస్ఫూర్తిని అవహేళన చేయకండిక

ఇంతగొప్ప గడ్డ మీద నాయకులుగా ఎదిగిన మీరు ఇంకా దీనులై, పరాధీనులై డిల్లీ గడప దగ్గర తెలంగాణను యాచించకండిక.

తెలంగాణ ఒకరిస్తే వచ్చేది కాదు నేతలారా. ప్రపంచంలో ఏ న్యాయమైన హక్కు కూడా పోరాటం లేకుండా సిద్ధించలేదు. తెలంగాణ కూడా మనం సంఘటితమై గుంజుకోవాల్సిందే.

జరిగిన అవమానాలు చాలు. ఇక చాలించండి వేడుకోళ్లు. డిల్లీని వదిలి గల్లీబాట పట్టండి. అధినేత్రిని నమ్మడం మాని ప్రజలను నమ్ముకోండి. తెలంగాణ దానంతట అదే వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *