mt_logo

స్టేషన్‌ఘణపూర్…ఒక స్ఫూర్తి!

-గటిక విజయ్ కుమార్

రాజకీయ పార్టీకి సమాజాన్ని సమీకరించే సహజలక్షణం ఉంటుంది. అది పోరాటాలతో పెనవేసుకుంటే మరింత శక్తివంతమవుతుందని ఏంగెల్స్ తన రచనల్లో చెప్పాడు. 160 ఏళ్ల కిందట ఆయన చెప్పిన మాటలు తెలంగాణ ఉద్యమం విషయంలో అక్షర సత్యాలవుతున్నాయి. ప్రజలందరినీ ఏకం చేసి, వారి గొంతుక వినిపించే వేదికగా ఇవ్వాళ రాజకీయ పార్టీ కనబడుతున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ లక్ష్యం సాధించుకోవాలన్నా అది రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందన్న వాస్తవం మనకు అనుభవంలోకి వస్తున్నది. ప్రజల ఆకాంక్షనే ఎజెండాగా పెట్టుకున్న రాజకీయ పార్టీకి సహజంగానే ప్రజల విస్తృత ఆమోదం లభిస్తుంది. వివిధ రాజకీయపార్టీల సిద్దాంతాలు, విధానాలు ఏమైనప్పటికీ తక్షణ ప్రజల డిమాండ్ మాత్రమే అందరి ముందు కనిపించే లక్ష్యం అవుతుంది. అందుకే “ఇప్పుడు ఆంధ్రా పార్టీలు మనకు అవసరమా?” అన్న టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్న ప్రజలను ఆలోచింపచేస్తున్నది.

కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ ముమ్మాటికీ ఆంధ్రా పార్టీలేనని జనం నమ్ముతున్నారు. జనం అభిప్రాయాలను గుర్తించిన నాయకులు కూడా ఆ పార్టీలను వదులుతున్నారు. రాజకీయంగా బద్దవైరం ఉన్న నాయకులు కూడా ప్రజల కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం ఓ ఉదాహరణ. స్టేషన్ ఘణపూర్ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రానికి వర్తమాన రూపం.

తొమ్మిదిన్నరేళ్ల టీడీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరిని ఓడించి మంత్రి అయిన డాక్టర్ విజయరామారావు టీఆర్‌ఎస్ లోనే ఉన్నారు. ఆయన మొదటి నుంచి తెలంగాణవాదం వినిపిస్తున్న వారే. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి కడియం శ్రీహరిపై గెలిచిన డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా తెలంగాణవాది. పదిహేనేళ్లు కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణవాణిని వినిపించారు. కడియం శ్రీహరి లాంటి శక్తివంతమైన నాయకుడిని ఎదుర్కొనే క్రమంలో ఎన్నో కష్టాలు అనుభవించినా కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అలాంటి రాజయ్య, కాంగ్రెస్ మారదని, తెలంగాణకు న్యాయం చేయదని భావించి, అధికార పార్టీద్వారా సహజంగా ఉండే అనుకూలతలను కూడా వదులుకుని ఉద్యమపార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ తరుఫున పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచారు. ఫలితంగా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.

2009 ఎన్నికల్లోనే స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుఫున ఆరూరి రమేష్ పోటీ చేశారు. చిరంజీవి వినిపించిన సామాజిక తెలంగాణ నినాదానికి ఆకర్షితుడై ఆ పార్టీ తరుఫున బరిలో నిలబడ్డారు. ఆయనకు దాదాపు 32 వేల ఓట్లు వచ్చాయి. కానీ డిసెంబర్ 9 ప్రకటన తర్వాత చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీల వైఖరి మారడంతో ఆరూరి రమేష్ మనసు మార్చుకున్నారు. పీఆర్పీది ఆంధ్రపార్టీ అని గుర్తించారు. తెలంగాణ కోసం కొట్లాడే అవకాశం ఆ పార్టీలో లేదని తేల్చుకుని ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీనివల్ల నియోజకవర్గంలో పీఆర్పీ ఉనికి లేకుండా పోయింది. అదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి కూడా మొదటి నుంచి తెలంగాణ వాదం వినిపిస్తున్న వారే. తెలుగుదేశం పార్టీని తెలంగాణకు అనుకూలంగా మార్చడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా సరే పార్టీ వైఖరిలో మార్పు రాదని, చంద్రబాబు ఎన్నటికైనా ఆంధ్రాబాబే అని తెలుసుకున్నారు. టీడీపీని వీడారు.

ఫలితంగా నియోజకవర్గంలో తెలుగుదేశం తుడిచిపెట్టుకుపోయింది. ఒకే నియోజవర్గం నుంచి నాలుగు పార్టీల తరుఫున పోటీ చేసిన నాయకులు డాక్టర్ విజయ రామారావు, కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, ఆరూరి రమేష్ అంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. వారంతా తమ సొంత పార్టీలకు ఏళ్లకు ఏళ్లు సేవలు చేసి, సొంతంగా అభిమానులు,కార్యకర్తలు కలిగిన నాయకులు. అలాంటి వారు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇప్పుడు స్టేషన్ ఘణపూర్‌లో మరో పార్టీ లేదు. మొదటి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్న ప్రత్యర్థులే ఒకరి చేరికను మరొకరు హృదయపూర్వకంగా ఆమోదించడం మరో కీలకాంశం. డాక్టర్ రాజయ్య పార్టీలో చేరినప్పుడు అప్పటి వరకు ఆయన ప్రత్యర్థులుగా ఉన్న డాక్టర్ విజయ రామారావు, ఆరూరి రమేష్ సాదరంగా ఆహ్వానించడమే కాకుండా ఉప ఎన్నికల్లో చిత్తశుద్ధిగా పనిచేశారు.

తాము ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించాల్సిన నియోజకవర్గంలో మరో నేత పోటీగా వస్తున్నాడని భావించలేదు. ఉద్యమానికి మరో తోడు దొరికిందనే సంబురపడ్డారు. ఇప్పుడు కడియం శ్రీహరి చేరిక సందర్భంలో కూడా డాక్టర్ రాజయ్య, ఆరూరి రమేష్ లాంటి నాయకులు అలాంటి విశాల ప్రయోజనాన్నే ఆశించి స్వాగతించారు. గ్రామాల్లో కూడా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు గులాబీ జెండా నీడన ఒదిగిపోయారు. తెలంగాణ ఉద్యమం ద్వారా కలిసి చేసిన పోరాటం జనంలో ఐక్యతను పెంచింది. తెలంగాణ కోసం ఒక్కటి కావాలనే స్పృహ కలిగించింది. అదే స్ఫూర్తి ఇప్పుడు స్టేషన్ ఘణపూర్‌లో కనిపించింది. ఇది తెలంగాణ పది జిల్లాలకు పాకనుంది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *