గ్రేటర్ హైదరాబాద్ ఔట్ సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడుతుంది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించినా, కొంతమంది కార్మిక సంఘాల నాయకుల మాటలు విని సమ్మెకు దిగారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సమ్మెను కొనసాగించడం పట్ల సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కార్మికులు ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రేపటినుండి ఆర్మీ పోలీసులు, ఇతర ఉద్యోగులను ఉపయోగించుకుని పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు సమ్మె విరమించకపోతే వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
ఇదిలాఉండగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో హోం మరియు కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, టీ పద్మారావు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ సోమేశ్ కుమార్, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు సమావేశమై మున్సిపల్ కార్మికుల సమ్మెపై సీఎంతో చర్చలు జరిపారు.