శాసనసభ వ్యవహారాల శాఖ తొలగించి వాణిజ్య పన్నుల శాఖ అప్పగించడాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం రాజీనామా లేఖను సీఎం కు అందచేయనున్నారు. అసెంబ్లీ ప్రోరోగ్ విషయంలోనూ, తెలంగాణపై చర్చ మొదలుపెట్టడంలోనూ తానూ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించానని, ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
తెలంగాణ అంశంపై జనవరి 3నుండి చర్చ ప్రారంభం కానున్న సందర్భంగా శ్రీధర్ బాబు నుండి ఇబ్బందులు తలెత్తుతాయనే ముందు జాగ్రత్తగా శాఖ మార్పు జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాఖ మార్పు వార్త తెలియగానే అన్ని పార్టీల నాయకులు శ్రీధర్ బాబుకు అండగా నిలిచారు. బుధవారం ఉదయమే రాజీనామాకు సిద్ధమైన ఆయనను, మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు తదితరులు రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. కానీ ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికే శ్రీధర్ బాబు సిద్ధమయ్యారు. సీఎంకు తగిన గుణపాఠం చెప్పాలంటే రాజీనామా చేయాల్సిందేనని ఆయన సహచరులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీధర్ బాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిది రెచ్చగొట్టే ధోరణి అని, ఎత్తి పరిస్థితుల్లో తాను వాణిజ్య శాఖను అంగీకరించేది లేదని, ఈ విషయంపై అధిష్టానానికి తెలియపరుస్తానని, ఆ తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకుంటానని అన్నారు. తాను మొత్తం కేబినెట్ కే రాజీనామా చేస్తానంటే జానారెడ్డి వారించారని, దీని ప్రభావం ముసాయిదా బిల్లుపై పడుతుందని అన్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.