మిషన్ భగీరథ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా అమలుచేసే దిశగా తెలంగాణ మిషన్ భగీరథ అధికారులు సిద్దమవుతున్నారు. తాగునీరు కోసం ప్రజలు ఇబ్బందిపడొద్దని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశం యావత్తును విశేషంగా ఆకర్షించిన విషయం తెలిసిందే. మిషన్ భగీరథ పథకంతో గ్రామంలోని ప్రతి కుటుంబానికి మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ మిషన్ భగీరథ పాలసీ పేరుతో అధికారులు ఒక యాప్ రూపొందిస్తున్నారు. ఇందుకోసం పాలసీ రూపకల్పనకు అవరసరమైన మార్గదర్శకాలను నిర్ణయించడానికి పలువురు నిపుణులతో వర్క్ షాప్ ను నిర్వహించారు.
ప్రాజెక్ట్ నిర్వహణ పాలసీ ముసాయిదాను మార్చి చివరిలోగా ప్రభుత్వం ఆమోదం కోసం సమర్పించి ఏప్రిల్ 1 నుండి తెలంగాణ మిషన్ భగీరథ పాలసీని అమలుచేస్తామని ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ తాగునీటిని ఇస్తున్నారనే కాకుండా ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా అవుతున్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు కూడా ఈ యాప్ ను ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు 5,089 ఇండ్ల నుండి 20వేలమంది ఫోన్ నంబర్లను ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు సేకరించారు. ప్రతి రోజు ఉదయం 6 నుండి 8 వరకు, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నీటిని సరఫరా చేసేలా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.