mt_logo

తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నెల వేతనంతో కలిపి ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైలుపై సంతకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో నిల్చున్న ఉద్యోగుల చారిత్రాత్మక పోరాటాలను తెలంగాణ ప్రజలు మర్చిపోరని, వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని సీఎం గతంలో అనేకసార్లు పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు ఏటా సుమారు 185 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల వరకు ఆర్ధిక భారం పడుతుందని ఆర్ధికశాఖ అధికారులు చెప్పినా ఈ భారాన్ని పట్టించుకోవాల్సిన పని లేదని సీఎం స్పష్టం చేశారు. 2010 సం.లో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 9వ పీఆర్సీ నిబంధనల ప్రకారం వేతనాలు అందుకుంటున్న తెలంగాణ ఉద్యోగులందరికీ ఈ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని, వారి సర్వీస్ ముగిసేంత వరకూ ఉంటుందని నిబంధనలు జారీ చేశారు.

స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి తెలంగాణ ఉద్యోగుల పోరాటపటిమకు చరిత్రలో స్థానం కల్పించారని, ఇచ్చిన ప్రతి హామీకి కార్యరూపం ఇవ్వడమే పనిగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగుతున్నదని ఉద్యోగసంఘాల నేతలు దేవీ ప్రసాద్, సీ విఠల్, కారం రవీందర్ రెడ్డి, ఏ పద్మాచారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *