కాంగెస్ అధినేత్రి సోనియాగాంధీ చొరవవల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ ప్రథమస్థానంలో నిలిస్తే రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ పార్టీ రెండో స్థానంలో ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన దేశంలోని 33 పార్టీలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతి శాసనసభ్యుడు ఇచ్చే సూచనలను సహృదయంతో స్వీకరిస్తామని, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, పాలనలో ఒంటెద్దు పోకడలకు తావులేదని అన్నారు.
రాజకీయ అవినీతి బంద్ అయితేనే పరిపాలన సాఫీగా సాగుతుందని, కొత్త రాష్ట్రంలో అరాచకాలకు తావులేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతిహామీని ఖచ్చితంగా అమలుచేసి తీరుతామని, దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమిని అందించనున్నట్లు పేర్కొన్నారు.
లక్షలోపు రైతుల పంటరుణాలను ఖచ్చితంగా మాఫీ చేస్తామని, రైతుల రుణమాఫీపై వెనక్కు తగ్గమని స్పష్టం చేశారు. పంట రుణాలే కాకుండా బంగారం పెట్టి తీసుకున్న పంటరుణం కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై 19 వేలకోట్ల రూపాయల భారం పడనుందని, 26 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.