తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటం, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విద్యుత్ లోటును అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ రంగాన్ని ప్రోత్సహిస్తుండటంతో సౌర విద్యుత్ పరికరాల కంపెనీలు, బ్యాటరీ ఉత్పత్తి కంపెనీలు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నాయి. అంతేకాకుండా సౌర విద్యుదుత్పత్తికి అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సోలార్ కంపెనీలను ఆకట్టుకుంటున్నాయి. అందుకే తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియషన్ (టీసీ) అధ్యక్షుడు బీ అశోక్ కుమార్ సోలార్ ఎక్స్ పో నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ సంస్థను ఒప్పించి తొలి సోలార్ ఎక్స్ పో నిర్వహణ తెలంగాణలో జరిగేందుకు కీలకపాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో ఈనెల 26 నుండి 28 వ తేదీ వరకు అంటే మూడురోజులపాటు మాదాపూర్ హైటెక్స్ లో జరగనున్న ప్రదర్శనలో సోలార్ రంగంలో సేవలందిస్తున్న పలు కంపెనీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సోలార్ కంపెనీలు, సంస్థలు, ఎల్ఈడీ ఉత్పత్తి కంపెనీలు, బ్యాటరీ ఉత్పత్తి కంపెనీలు పాల్గొంటున్నాయి. దాదాపు రెండు వందల కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నట్లు, తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, హెచ్ పీఎల్, అమర్ రాజా, ఫిన్ కాబ్, ఇన్టెలెక్స్, వీ లీడ్ ఎల్ఈడీ లైట్స్ తదితర ముఖ్య కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు అశోక్ కుమార్ తెలిపారు.