వానాకాలం పంటల విస్తీర్ణం, పంటల సరళి, ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లు, యాసంగి విత్తన ప్రణాళికపై వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఎఫ్సీఐ జీఎం దీపక్ శర్మ, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి పంటల నమోదులో వందశాతం ఖచ్చితత్వం ఉండాలని, ఇందుకోసం ధరణి పోర్టల్ లో సర్వే నంబర్ల వారీ మ్యాపుల ఆధారంగా పంటల నమోదు చేయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా పంటనమోదు వివరాలు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులందరూ జిల్లా పర్యటన చేయాలని, ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు వ్యవసాయ అధికారులకు వేరే పనులు అప్పగించవద్దని మంత్రి కోరారు.
పంటనమోదు తదుపరి కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని తెలియజేసారు. వ్యవసాయ విద్యాలయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు యాసంగిలో ఆరుతడి పంటలైన వేరుశెనగ, ఇతర నూనెగింజల పంటలు ఆవాలు, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు పంటలతో పాటు పప్పు శెనగ వేసేలా వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పెరిగిన సాగు నీటి వసతుల నేపథ్యంలో ఒకే రకమైన పంటలు కాకుండా అన్నిరకాల పంటలు పండించేలా రైతులు తమ సాగు విధానాలను మార్చుకునేలా, తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని అవలంభించేలా శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎఫ్సీఐ జీఎం దీపక్ శర్మ మాట్లాడుతూ..ఇకపై ఎఫ్సీఐ కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల వానాకాలం సన్నరకం వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని, బాయిల్డ్ ధాన్యానికి ఉపయోగించే దొడ్డు వడ్ల రకాలను కొనుగోలు చేయమని, ఈ యాసంగిలో వీలైనంత వరకు వరి పంటను సాగు చేయొద్దని, తప్పనిసరి అయుతె సన్న రకాలను మాత్రమే సాగు చేయాలని తెలిపారు