mt_logo

సింగపూర్ స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం

– చిన్న దేశమైనా ఎంతో అభివృద్ధి
– ప్రజాప్రతినిధులను పర్యటనకు పంపిస్తా
– తెలంగాణ గురించి వారికి వివరించా
– మన పారిశ్రామిక విధానానికి ప్రశంసలు
– మీడియాతో సీఎం కేసీఆర్

వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమవుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వైశాల్యం, జనాభాలో అతి చిన్న దేశమైన సింగపూర్ అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడడం ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఐదురోజులపాటు సింగపూర్, మలేషియా దేశాల పర్యటనను ముగించుకొని వచ్చిన కేసీఆర్ సోమవారం తన అనుభవాలను, అనుభూతులను మీడియాతో పంచుకున్నారు.

సింగపూర్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కేసీఆర్ అన్నారు. మంచినీళ్ల నుంచి ప్రతి చిన్న వస్తువు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన సింగపూర్ అర్థిక ప్రగతిలో ఇప్పుడు అగ్ర రాజ్యమైన అమెరికా సరసన చేరిందని శ్లాఘించారు. కేవలం 53 లక్షల జనాభా, కోటి 75 లక్షల ఎకరాల భూభాగం మాత్రమే ఉన్న సింగపూర్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అన్నిరంగాల్లో ముందడుగు వేయడం ఆ దేశ ప్రజల సంఘటిత కృషికి నిదర్శమని అన్నారు. సింగపూర్‌లో స్థిరపడిన ఇతర దేశాల పౌరులు కూడా తాము ఆ దేశ పౌరులమేనని గర్వంగా చెప్పుకోవడం తనను ఎంతో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చెప్పారు.

పరిశుభ్రతకు మారుపేరు..
సింగపూర్ దేశమంతా పచ్చిక బయళ్లతో ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని, రోడ్లపై ఎక్కడా చిన్న కాగితం ముక్కకూడా కనిపించదని కేసీఆర్ చెప్పారు. ఆ దేశ వైశాల్యం ఒకప్పుడు 640 చదరపు కిలోమీటర్లు ఉండేదని, ఇప్పుడు 700 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని ఇది ఆ దేశం సాధించిన విజయాలలో ఒకటని కేసీఆర్ అన్నారు. ఏమీలేని దీనస్థితి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి సింగపూర్ చేరుకుందంటే దానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, ప్రజల భాగస్వామ్యమే కారణమని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్ దేశం డాలర్ మారకం విలువ భారతదేశ కరెన్సీతో రూ.50 ఉందని, తలసరి ఆదాయం 50 మిలియన్ డాలర్లు అని సింగపూర్ ఆర్థిక వ్యవస్థ స్థాయిని కేసీఆర్ వివరించారు.

మనమెందుకు వెనకబడ్డాం..?
తక్కువ భూభాగం, తక్కువ వనరులు వున్న సింగపూర్ అంతగా అభివృద్ధి చెందినప్పుడు, విశాల భూభాగం, అపార వనరులు వున్న మన దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదనే బాధ కలుగుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్ ఒకప్పుడు వెనుకబడ్డ దేశాల సరసన ఉన్న మూడవ ప్రపంచ దేశమని, ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశమని అయన అన్నారు. సింగపూర్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఆ దేశ మొదటి ప్రధాని లీ క్వాన్ యుకే దక్కుతుందని అన్నారు. లీ క్వాన్ యు రాసిన సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టు ఫస్ట్ అనే పుస్తకాన్ని 1995లోనే చదివానని ఆయన చెప్పారు.

ఇప్పుడు ఆ దేశాన్ని స్వయంగా చూసే అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతోనే తాను జన్మభూమి పథకాన్ని రూపకల్పన చేసినట్లు చంద్రశేఖర్ రావు వెల్లడించారు. లీ క్వాన్ యు రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువదించాలనుకుంటున్నట్లు చెప్పిన సీఎం, దీని వల్ల ప్రపంచంలోని తెలుగు వారికి ఒకనాటి సింగపూర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని తెలుస్తుందని అన్నారు. అభివృద్ధిని కోరుకునే దేశాలకు, పౌరులకు అది అవసరమైన పాఠం అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భూమి కొరత సహజ వనరుల కొరత ఉన్నా చైనా, ఇండియా, డచ్, బ్రిటీష్ దేశాల నుంచి వచ్చిన వారు సింగపూర్‌ను ఓ అద్భుతమైన దేశంగా ఎలా తీర్చిదిద్దారో ఈ పుస్తకంలో ఉంటుందని సీఎం చెప్పారు.

ప్రజాప్రతినిధులందరినీ పంపిస్తా…
సింగపూర్ పర్యటనతో తాను ఎంతో నేర్చుకున్నానని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లను కూడా సింగపూర్ పంపుతానని కేసీఆర్ తెలిపారు. వారికి శిక్షణ ఇవ్వాలని సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌ను కోరారని ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్‌తో పాటు పక్కనే ఉన్న మలేషియా కూడా గొప్పగా అభివృద్ధి చెందిందని, రెండు దేశాల మధ్య ఉన్న వారథిపై కారులో ప్రయాణం చేయడం వల్ల అక్కడి పరిశ్రమలు, వాతావరణం, ఇతర జనావాసాలను స్వయంగా చూసే అవకాశం కలిగిందన్నారు. మలేషియా ప్రతి సంవత్సరం 2.7 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు.

తెలంగాణ గురించి చెప్పా…
సింగపూర్ పర్యటనలో తెలంగాణను అక్కడి వారికి పరిచయం చేశానని కేసీఆర్ చెప్పారు. వివిధ సమావేశాలు, గ్రూప్ మీటింగ్‌లలో తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం సరళంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందని, అనుమతుల కోసం సింగిల్ విండో, చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో అక్కడి వారు ఎంతో అభినందించారని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్‌లో జరిపిన పర్యటనలో అనేక రంగాల అభివృద్ధిపై స్వయంగా అధ్యయనం చేశానని, ఇది తెలంగాణ పునర్నిర్మానానికి ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

సక్సెస్ టూర్..!

– సీఎం పర్యటనకు అనూహ్య స్పందన
– సింగపూర్ సదస్సులో ఆకట్టుకున్న సీఎం ప్రసంగం
– జీరో కరప్షన్, ల్యాండ్ బ్యాంక్ విధానాలకు ఫిదా
– స్పెషల్ ఛేజింగ్ సెల్, పారదర్శక పాలసీకి ప్రశంసలు
– పరిశ్రమల ఏర్పాటుకు అంతర్జాతీయ కంపెనీల సంసిద్ధత
– విధి విధానాలను వాకబు చేసిన వందకు పైగా కంపెనీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విదేశీ పర్యటన దిగ్వజయవంతమైంది. గ్లోబల్ మార్కెట్‌లో తెలంగాణ బ్రాండ్‌ను నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. నాలుగు రోజుల సింగపూర్, మలేషియా పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. సింగపూర్‌లో ఐఐఎం అల్యూమ్ని కార్యక్రమంలో సీఎం చేసిన ఒక్క ప్రసంగం విశ్వ యవనికపై తెలంగాణ జెండాను రెపరెపలాడించింది.

ఆయన ప్రసంగం ముగిసీ ముగియగానే తెలంగాణలో మెగా ప్రాజెక్టులు అమలు చేస్తామంటూ మూడు అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రతిపాదనలను రాష్ట్ర అధికారులకు అందించాయి. సమయం ఇస్తే వచ్చి స్థలాలు ఎంపిక చేసుకుంటామని చెప్పాయి. సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వ లక్ష్యాలను, విధి విధానాలను వివరించిన తీరు అనేక దేశాల నుంచి వచ్చిన బహుళ జాతి కంపెనీల ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకుంది. జీరో కరప్షన్, సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్, ఒక్క సమావేశంలో అన్ని అనుమతులు వంటి విధానాలు వారిని అమితంగా ఆకట్టుకున్నాయి. పారిశ్రామిక వాడల్లో ప్లగ్ అండ్ ప్లే విధానం గురించి వివిధ దేశాల ప్రతినిధులు రాష్ట్ర అధికారులను వాకబు చేశారు. ఆ ప్రతినిధులు తమ తమ దేశాల్లోని పారిశ్రామిక సంస్థలకు ఈ విషయాలు తెలియచేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానం ఖరారు చేయగానే తమకు సమాచారం అందించాలని కోరాయి. ఇక సీఎం రెండో ప్రసంగం సింగపూర్ ఇండస్ట్రీయల్ అసోసియేషన్‌తో జరిగిన సమావేశంలో ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనలన్నింటినీ సీఎం వారికి వివరించారు. దానికి స్పందనగా పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు తమ దగ్గరికి వచ్చి పూర్తి వివరాలు కావాలంటూ అడిగినట్లు సీఎం వెంట వెళ్లిన అధికారులు తెలిపారు.

జీరో కరప్షన్ .. ల్యాండ్ బ్యాంక్
తెలంగాణ పారిశ్రామిక విధానంలో పారిశ్రామికవేత్తలను విపరీతంగా ఆకట్టుకున్న అంశాలు జీరో కరప్షన్, ల్యాండ్ బ్యాంక్. ఆ తర్వాత సింగిల్‌విండో విధానం, సీఎం కార్యాలయంలో స్పెషల్ ఛేజింగ్ సెల్ విభాగాలు ఉన్నాయి. ఈ అంశాలే తెలంగాణకు పెట్టుబడులు వచ్చేందుకు బాగా దోహదపడుతాయని సింగపూర్ మంత్రి భారత సంతతికి చెందిన ఈశ్వరన్ తమకు చెప్పారని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్‌రంజన్ తెలిపారు. సింగపూర్ అభివృద్ధిపథాన నడిచేందుకు కరప్షన్ ఫ్రీ ఎంతగానో ఉపయోగపడిందని ఆయన చెప్పారన్నారు. తమ పర్యటనలో అవినీతి నిర్మూలనకు సింగపూర్ ప్రభుత్వం, ప్రజలు చేపట్టిన అంశాలపై దృష్టి సారించామన్నారు. సెప్టెంబరు మొదటి వారంలో జరుగనున్న క్యాబినేట్ సమావేశంలో పారిశ్రామిక పాలసీని ఆమోదించనున్నారు. ఈ లోపు సింగపూర్ పర్యటన అనుభవ పాఠాలను పాలసీలో జోడించనున్నారు.

తెలంగాణకు రానున్న కంపెనీలు
– ఇటాలియన్ కంపెనీ ఒకటి భారత్‌లో బ్రేవరేజెస్ కంపెనీని నెలకొల్పాలని భావించింది. ఐతే కేసీఆర్ ప్రసంగం విన్న వెంటనే సదరు కంపెనీ ప్రతినిధులు అధికారుల దగ్గరికి వచ్చి ఏకంగా ప్రాజెక్టు నివేదికను సమర్పించారు.

– మరో అంతర్జాతీయ సంస్థ ఈస్ట్‌మన్ కెమికల్ కంపెనీ కూడా భారత్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్లాస్టిక్ ఆధారిత కంపెనీకి తెలంగాణను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రాజెక్టు రిపోర్టును పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్‌రంజన్‌కు సమర్పించారు.

– సింగపూర్‌కు చెందిన పౌల్ట్రీ ఫీడ్ తయారీ సంస్థ తమ కంపెనీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే తెలంగాణకు వస్తామని ప్రకటించారు.

– సమావేశాలకు హాజరైన వందకు పైగా కంపెనీలు తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీ ఖరారులో సీఎం కేసీఆర్ ప్రస్తావించిన అంశాల్లో సగం ఉన్నా తాము పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పాలసీ ఖరారు కాగానే సంప్రదింపులకు వారి చిరునామాలను(విజిటింగ్ కార్డులు) రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్రకు అందజేశారు. పాలసీ ప్రకటన పూర్తి కాగానే ఆయా కంపెనీలను తెలంగాణకు సాదరంగా ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పర్యటనకు అనూహ్య స్పందన
సింగపూర్ టూర్ సక్సెస్ అయ్యింది. మేం ఊహించని విధంగా అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ లక్ష్యాలను, విధి విధానాలను పారిశ్రామికవేత్తలు చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. 22న ఐఐఎం సమావేశం తర్వాత వందలాది మంది మా దగ్గరికి వచ్చారు. మరిన్ని వివరాలు అడిగారు. పాలసీ గురించి చెప్పాం. వారిలో పది శాతం కంపెనీలు తెలంగాణకు వచ్చినా సక్సెస్ శాతం వందకు పైగా ఉన్నట్లే. వారందరికీ పూర్తి వివరాలను మెయిల్ చేస్తున్నాం. చాలా మంది కంపెనీలు పెట్టడానికే మొగ్గు చూపారు అని పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర సోమవారం చెప్పారు. సీఎంతో పాటు టూర్‌లో పాల్గొన్న అధికారులంతా తెలంగాణ ప్రభుత్వ విధి విధానాలను గ్లోబల్ మార్కెట్‌లో ఉంచినట్లయ్యిం దంటున్నారు. సింగపూర్‌లో ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ.

దాన్ని ప్రభుత్వ రంగ సంస్థ జేటీసీ కల్పిస్తోంది. దాన్ని పనితీరును పరిశీలించాం. తెలంగాణలోనూ భూ కేటాయింపులకు ముందే ఇండస్ట్రియల్ పార్కుల్లో అన్ని వసతులు కల్పించాలన్న నిర్ణయానికి వచ్చాం. అలాగే అన్ని రకాల క్లియరెన్సులు ఈడీపీ వ్యవస్థ చూస్తుంది. ఇక్కడ కూడా దాని కోసం సీఎం కార్యాలయంలో స్పెషల్ ఛేజింగ్ సెల్ ఏర్పాటువుంది అని టీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ తెలిపారు. మొత్తానికి ముఖ్యమంత్రి పర్యటన అప్పుడే స్టడీ టూర్లు.. అంటూ విమర్శించిన వారికి సమాధానమిచ్చేటట్లుగా కనిపిస్తోంది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *