ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వ, విద్యుత్ ఉత్పత్తి అంశంపై కొనసాగుతున్న వివాదాలను, తెలంగాణ రాష్ట్రంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను సీఎం కేసీఆర్ గవర్నర్ కు వివరించారు. సీలేరు నుండి శ్రీశైలం దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తుందో తెలియజేసి విభజన చట్టంలోని అన్ని అంశాలను తూచా తప్పకుండా పాటించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణకు రావలసిన నీరు, విద్యుత్ వాటాల వివరాలను జీవోలతో సహా తెలిపారు.
దొంగే దొంగ అన్నట్లు ఏపీ ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తుందని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 261 టీఎంసీల నీటిని కేటాయించారని, ఇందులో 184.9 టీఎంసీలు నికరజలాలు కాగా, 75. 67 టీఎంసీలు మిగులు జలాలని కేసీఆర్ చెప్పారు. గతంలో జారీ చేసిన జీవో 69 ప్రకారం శ్రీశైలంలో 834 అడుగుల నీటిమట్టం వరకూ విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 60 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుండి వాడుకున్నారని ఏపీ ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయని సీఎం వివరించారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం విద్యుత్ లో తెలంగాణకు 54% వాటా రావాల్సిఉన్నా, కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి తెలంగాణకు రావాల్సిన వాటాను ఏపీ సర్కారు రాకుండా చేసిందని గవర్నర్ కు చెప్పినట్లు సమాచారం. సీలేరు నుండి తెలంగాణకు రావాల్సిన 291 యూనిట్ల విద్యుత్ చంద్రబాబు కుట్రల వల్ల తెలంగాణ రాష్ట్రం కోల్పోయిందని, వీటివల్ల తెలంగాణ తీవ్రమైన కరెంటు కొరతతో ఇబ్బందులు పడుతుంటే జీవోలను, చట్టాలను ఉల్లంఘిస్తూ ఏపీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తుందని, వీటిపై వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్రలను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ గవర్నర్ ను కోరారని తెలిసింది.