రైతులకు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు మెదక్ జిల్లా సిద్దిపేట మండలం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో రూ. 5 కే ఈ పథకాన్ని ప్రారంభించామని, ఇందులో రైతులు రూ. 5 చెల్లించగా, మార్కెట్ కమిటీ రూ. 5, మిగిలిన ఖర్చులను ఎంఈఐఎల్ కంపెనీ, హరే రామ హరే కృష్ణ ట్రస్టు భరించనున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 150 మార్కెట్ యార్డులుండగా మొట్టమొదట సిద్దిపేట యార్డులో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డుల్లో కూడా దాతల సహకారంతో సద్దిమూట పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
అంతేకాకుండా దవాఖానల్లో అందించే భోజనామృతం రోగులకు, సహాయకులకు ఉచితంగా అందించనున్నామని హరీష్ చెప్పారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేనప్పుడు గోదాములో నిల్వ చేసుకునే అవకాశాన్ని రైతుబంధు పథకం ద్వారా కల్పించామని, నిల్వ చేసుకున్న ధాన్యంపై 75 శాతం వరకు అంటే సుమారు రూ. 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చని, దీనికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. రైతుకు ప్రమాద భీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తామని హరీష్ రావు ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి లక్ష్మీ భాయ్, జాయింట్ కలెక్టర్ శరత్, ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్ రవి రెడ్డి, హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ప్రతినిధి సత్యగౌరీచంద్ర తదితరులు పాల్గొన్నారు.