mt_logo

రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన షిండే

ఈ రోజు ఉదయం ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. కొన్ని బిల్లులను ఆందోళనల మధ్యే పాస్ చేయగా, తెలంగాణ బిల్లు ఐదవ అంశంగా రాజ్యసభలో నిర్ణయించారు. సీమాంధ్ర ఎంపీలు సీఎం రమేష్, సుజనాచౌదరి, కేవీపీ ముగ్గురు త్రిమూర్తులు పట్టువదలకుండా స్పీకర్ పోడియం వద్ద నిలబడి ఆందోళన చేస్తూనే ఉన్నారు. తెలంగాణ టీడీపీ ఎంపీ గుండు సుధారాణి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్లకార్డును ప్రదర్శించగా, సీమాంధ్ర ఎంపీలు ముగ్గురూ సమైక్యాంధ్ర ప్లకార్డులను ప్రదర్శించారు. ఉదయం నుండి రాజ్యసభలో వాయిదా మీద వాయిదా కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీజేపీ ఎంపీలు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్ లు తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ ను కోరారు. వాయిదా తర్వాత 3 గంటల 15ని.ల సమయంలో సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెట్టారు. షిండే ప్రవేశపెట్టగానే సీమాంధ్ర ఎంపీలు షిండే మీద, సెక్రటరీ జనరల్ మీద దాడి చేశారు. వారికి రక్షణగా కాంగ్రెస్ ఎంపీలు, మార్షల్స్ నిలబడగా సభను 10 నిమిషాలపాటు డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా గందరగోళం తగ్గకపోవడంతో షిండే గొడవ మధ్యే బిల్లును చదివి వినిపించారు. ఆందోళన తగ్గకపోవడంతో మళ్ళీ సభను 15 నిమిషాలపాటు డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు చేరుకున్న కాసేపటికే సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *