అమరవీరుల కుటుంబాలకు టీఆర్ఎస్ టిక్కెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోటీకి నిలిపిందని, త్యాగధనులకు ఓట్లు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ, శంకరమ్మ వద్ద పైసా, సీసా లేదని, ఆమె వద్ద ఉన్నది కేవలం కన్నీటి చుక్క మాత్రమేనని అన్నారు. అవసరమైతే ప్రతి ఇంటి నుంచి చందా వేసుకునైనా ఆమె గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న శంకరమ్మను గెలిపించకపోతే శ్రీకాంతాచారి త్యాగానికి అర్థం ఉండదని, తెలంగాణ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అమరవీరుల కుటుంబాల ప్రతినిధిగా పోటీచేస్తున్న శంకరమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్నారు.
తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమాలు చేయని వారు ఇప్పుడు తెలంగాణ తెచ్చామని చెప్పడం సిగ్గుచేటు అని, 14 ఏళ్లుగా ఉద్యమాలు చేసిన టీఆర్ఎస్, అమరుల బలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణను మేమే తెచ్చామని గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నేతలు చెప్పడం తెలంగాణవాదులను కించపరచడమే అని హరీష్ రావు మండిపడ్డారు. కిరణ్ హయాంలో కాబినెట్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి బిడ్డలను జైల్లో పెట్టించిన విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా ఆత్మత్యాగం చేసుకున్న యాదిరెడ్డి శవాన్ని తీసుకురావడానికి వెళ్ళిన మాపై కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేసులు పెట్టించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిలాంటి వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలో ప్రజలందరూ ఆలోచించాలని హరీష్ రావు సూచించారు.