mt_logo

అసెంబ్లీని పొడిగించాలని చెప్పడం సిగ్గుచేటు-హరీష్ రావు

తెలంగాణ బిల్లును భోగి మంటల్లో వేసి కాల్చిన వారిపై కేసు నమోదు చేయకుండా తనపై తప్పుడు కేసును మోపిన డీజీపీ తగిన సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు డిమాండ్ చేశారు. తనకో న్యాయం, సీమాంధ్రులకో న్యాయమా? అని ప్రశ్నించారు. సీమాంధ్రనేతలు బిల్లుపై చర్చ జరక్కుండా అడ్డుకొని సమయం వృథా చేసి ఇప్పుడు సమయం సరిపోలేదని, గడువు పెంచమని అడగడం సిగ్గుచేటని, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను పొడిగించవద్దని టీఆర్ఎస్ పార్టీ తరపున కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. గురువారం మెదక్ జిల్లా సిద్దిపేటలో వేరేపార్టీల కార్యకర్తలు కొందరు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హరీష్ రావు ప్రసంగించారు. బిల్లులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని, కేంద్రప్రభుత్వం వాటిని సవరించాలని రాతపూర్వకంగా స్పీకర్ కు అందజేసినట్లు తెలిపారు. బిల్లుపై ఏవిధమైన ఓటింగ్ ఉండదని, కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే కేంద్రానికి పంపబడుతుందని, ఏమైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా స్పీకర్ కు రాసి ఇస్తే ఆ నివేదిక కేంద్రానికి పంపబడుతుందని సూచించారు. 14రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో 3 రోజులు మాత్రమే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చించారని, 42 రోజుల గడువు చాలా ఎక్కువని హరీష్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *