సోమవారం ఇందిరాపార్క్ దగ్గరలోని ఎస్ఎంఎస్ సెంటర్లో 1969 ఉద్యమకారుల సంఘాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు టీవీలను ఏకే 47లుగా అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రజలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మీద మైండ్ గేమ్ ఆడటం ద్వారా శునకానందాన్ని పొందుతున్నాయని సీమాంధ్ర రంగుడబ్బాలైన టీవీ చానళ్ళను విమర్శించారు. సీఎం కిరణ్ ఒక ఫ్యాక్షన్ లీడర్ గా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలపై విషం చిమ్ముతున్నారని, తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలు విజయం సాధించడం పక్కా అని కోదండరాం స్పష్టం చేశారు. ఇప్పటి తెలంగాణ ఉద్యమానికి 1969లో జరిగిన ఉద్యమమే స్ఫూర్తి అని, 1968లో ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో స్థానిక ప్రజలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం మొదలైందని, తర్వాత ఖమ్మం జిల్లా నాయకులంతా తెలంగాణ ప్రాంతాల్లో తిరిగి ఆంధ్రాప్రాంతం వారు చేస్తున్న మోసాలపై చెప్పి ప్రజల్లో అవగాహన కలిగించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ముల్కీ ఉద్యమం వచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని చెప్పారు. ఆనాటి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో అమరులైన ఉద్యమకారుల జాబితా తయారుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ఢిల్లీలోని ఇండియా గేట్ తరహాలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1969నాటి ఉద్యమకారుల సంఘం నాయకులు కే.సత్యనారాయణ, ఎన్.స్వామి, ఎం.మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.