mt_logo

హైదరాబాదును యూటీ చేస్తే సీమాంధ్రకు కోలుకోలేని నష్టం!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక అడ్డుకోలేమనే నిర్ణయానికి వచ్చిన సీమాంధ్ర నాయకులు తమ దృష్టినంతా హైదరాబాద్ మీదనే కేంద్రీకరించారు. నిన్న ఆంటోనీ కమిటీతో భేటీ అయిన కాంగ్రెస్ మంత్రులు కూడా హైదరాబాద్ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదా రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధాని చేయాలనే డిమాండ్లు సీమాంధ్ర నాయకులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.

అయితే సీమాంధ్రలో ప్రజలు కూడా తమ నాయకులు చూపిన తోవనే వెళ్తుండటం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసినా, లేదా శాశ్వత ఉమ్మడి రాజధాని చేసినా సీమాంధ్ర ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది.

సీమాంధ్ర నాయకులకు ఈ విషయం తెలవక కాదు. విభజన అనివార్యమని తెలిసి కూడా గత మూడేండ్లుగా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి కాలం వెలిబుచ్చిన నాయకులకు ఇప్పుడు ఏం చేయాలో తోచక, ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ హైదరాబాదు అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చారన్నది విస్పష్టం.

ముందుగా హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయమనే డిమాండును చూద్దాం. ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్రులు విడిపోయినప్పుడు కూడా సరిగ్గా ఇదే డిమాండు చేసి భంగపడ్డ చరిత్ర ఉన్నది ఆంధ్ర నాయకులకు. ఒక నగరం భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్నదో, ఆ ప్రాంతానికి చెందిన స్థానికులకే దాని మీద హక్కు ఉంటుంది కానీ పెట్టుబడిదారులకో, యాత్రికులకో ఉండదని ఇంగితజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.

సరిగ్గా ఈ కారణం వల్లనే 1953లో మదరాసు ఆంధ్రులకు దక్కలేదు. 1960లో బొంబాయి గుజరాతీలకు దక్కలేదు.

తమకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదనే సంకుచిత మనస్థత్వానికి ఉదాహరణే ఈ కేంద్రపాలిత ప్రాంతం డిమాండు. పోనీ దీనివల్ల సీమాంధ్రులకు ఏమైనా లాభం కలుగుతుందా అంటే అదీలేదు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సీమాంధ్రకు కోలుకోలేని నష్టం కలుగుతుంది.

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే, ఇక్కడ లభించే రాయితీల వల్ల సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఇక్కడే ఉంచుతారు. అంతే కాదు ఇంకా కొత్త పెట్టుబడి కూడా ఇతోధికంగా పెడుతారు. దీనివల్ల సీమాంధ్ర కొత్త రాజధానికి వచ్చే పెట్టుబడులకు భారీగా గండి పడుతుంది.

హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం అయితే ఇక్కడి పన్ను ఆదాయం కూడా  కేంద్రానికి వెళ్తుంది. దానివల్ల సీమాంధ్రులకు పైసా లాభం లేదు. ఇవే పెట్టుబడులు, పన్నులు కనుక సీమాంధ్ర కొత్త రాజధానికి వస్తే ఆ లాభం అక్కడి ప్రజలకు ఒనగూరుతుంది.

ఇక చిరంజీవి లాంటి బుర్రతక్కువ రాజకీయ నాయకులు చెబుతున్నట్టు హైదరాబాదును రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధాని చేస్తే మాత్రం ఇక సీమాంధ్ర కోలుకోకుండా దెబ్బతింటుంది.

ఎందుకంటే రాజధాని అనేది ఏ రాష్ట్రానికైనా ఒక పెద్ద గ్రోత్ ఇంజన్. రాజధానికి వచ్చే పెట్టుబడులు, పన్నుల రాబడి, ఉపాధి కల్పన వంటివి లేకుండా సీమాంధ్ర ఎప్పటికీ సరిగ్గా అభివృద్ధి చెందలేదు.

సీమాంధ్రకు కనుక వెంటనే ఒక రాజధాని ప్రకటించి దాన్ని నిర్మించడం మొదలుపెడితే తద్వారా వేలాది కోట్ల పెట్టుబడులు ప్రవహిస్తాయి. కొత్త రియల్ ఎస్టేట్, వైద్య, విద్య, హోటల్, సాఫ్ట్ వేర్ పరిశ్రమలు వచ్చి అక్కడి యువతరానికి లక్షలాది ఉద్యోగాలు వస్తాయి.

విభజన సీమాంధ్ర ప్రజలకు ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇప్పుడు విభజన అనివార్యం అయినప్పుడు తమ హక్కుల కొరకు పోరాడకుండా ఏ ఉపయోగమూ లేని హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం, శాశ్వత ఉమ్మడి రాజధాని వంటి పనికిరాని డిమాండ్లు ముందుకుతెస్తే సీమాంధ్ర ప్రజలు కోలుకోలేనివిధంగా నష్టపోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *