తెలంగాణ ఏర్పాటు ఖాయం అవడంతో సీమాంధ్రలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి రాజకీయపార్టీలు చేస్తున్న ఆధిపత్యపోరు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి కల్పిస్తోంది.
నిన్న అనంతపురం, విజయనగరం, కడప తదితర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులే ఎక్కువ.
విజయనగరం జిల్లాలో అయితే రాష్ట్ర పీసీసీ చీఫ్ బొత్స నివాసం, ఆయన ఆస్తులే లక్ష్యంగా ప్రత్యర్ధిపార్టీలకు చెందిన అల్లరి మూకలు చెలరేగిపోయినయి.
బొత్సకు చెందిన క్యాంప్ ఆఫీసు, ఆయన బారు షాపులు, ఆయనకు చెందిన కేబుల్ నెట్వర్క్ కార్యాలయం ఈ దాడుల్లో ధ్వంసం అయినయి.
ఫొటో: వైకాపా కార్యకర్తలు తగులబెట్టిన బొత్స కేబుల్ ఆఫీసు సామాగ్రి
—
ఈ దాడులకు పాలప్డుతున్న వైకాపా యువకులను బొత్స అనుచరులు నిర్బంధించి చితకబాదడం కొసమెరుపు.
ఇక అనంతపురం టౌనులో తెదేపా, వైకాపా పార్టీల కార్యకర్తలు రాళ్లు, ఇటుకలతో తలపడి రణరంగం సృష్టించిండ్రు.
ఫొటో: అనంతపురం టౌనులో వైకాపా ఫ్లెక్సీని చింపుతున్న తెదేపా వర్గీయులు
—
ఇక కడప జిల్లా పొద్దుటూరులోని ప్రముఖ బంగారం మార్కెట్ ను ఆందోళనకారులు బలవంతంగా మూయించడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బంగారం వ్యాపారులు కలిసికట్టుగా ఆందోళనకారులపై ఎదురుదాడిచేయడంతో వారు అక్కడినుండి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది.
కడప జిల్లా రాజంపేటలో స్థానిక జేయేసీ, తెదేపా వర్గీయులు పోటాపోటీ ఆందోళనలకు దిగి చివరికి ఒకరినొకరు తన్నుకున్నారు.
ఇక అనేక సీమాంధ్ర పట్టణాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు. వీటిలో పేద ప్రజలకు చెందిన ఆటోలే ఎక్కువ ఉండటం ఆ ఆందోళన అమానవీయ కోణాన్ని సూచిస్తుంది.