మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగభవన్ లో తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి ని తెలంగాణ పంచాయితీరాజ్ నాలుగోతరగతి ఉద్యోగులు సన్మానించారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాతకూడా సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలోనే తిష్ట వేయాలని చూస్తున్నారని, అందుకు కావాల్సిన బోగస్ సర్టిఫికెట్లను సృష్టించి స్థానికత విషయంలో కుట్రలు చేస్తున్నారని అన్నారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే కొందరు ఆంద్ర ఉద్యోగులు బోగస్ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉండటానికి ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని, ఆంద్ర ఉద్యోగులను తెలంగాణకు కేటాయించితే అంగీకరించేదిలేదని దేవీప్రసాద్ స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా పంచాయితీరాజ్ లో స్వీపర్లుగా పనిచేస్తున్న వారి సర్వీసులను క్రమబద్దీకరించాలని, నెలకు కేవలం 1600 రూపాయల జీతంతో పనిచేస్తున్న స్వీపర్లకు కనీస సౌకర్యాలు కల్పించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.