బలవంతంగా సమ్మెలోకి రావాలంటూ సీమాంధ్ర ఉద్యోగినిపై ఒత్తిడిసెక్రటేరియట్ లో సీమాంధ్ర ఉద్యోగుల దాదాగిరీ.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ జరగని ఆకృత్యాలు నెల రోజుల సమైక్య ఉద్యమంలో జరుగుతున్నాయి. ఉద్యోగుల అభిప్రాయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా సమ్మెలోకి లాగుతున్న సీమాంధ్ర ఉద్యోగ సంఘాలపై నిరసనలు వ్యక్తమవుతున్నై.
సచివాలయంలో న్యాయశాఖ విభాగంలో పనిచేస్తున్న గెజిటెడ్ ఉద్యోగిని శారదాంబ పై సీమాంధ్ర ఉద్యోగుల దాష్టీకమే ఇందుకు ఒక ఉదాహరణ.
మొదటి నుండి సమైక్య ఉద్యమానికి దూరంగా వుంటున్న శారదాంబను బలవంతంగా సమ్మెలోకి లాగడానికి ప్రయత్నిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు ఆమెను తమకు మద్దతు ఇవ్వకపోతే మీడియాలో వార్తలు వస్తాయని ఒత్తిడి తెచ్చారు.సీమాంధ్ర నాయకుల తీరుపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఒక్కసారిగా లో బీపీతో కూలబడిపోయారు.
విషయం తెలుసుకున్న సచివాలయ తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజ్ కుమార్ గుప్తా మరికొందరు తెలంగాణ మహిళా ఉద్యోగులు ఆమెను హుటహుటిన సచివాలయంలో వున్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
సెక్రటేరియట్ తెలంగాణ ఎంప్లాయీస్ చైర్మన్ నరేందర్ రావ్ మాట్లాడుతూ సమ్మెలోకి రావాలో వద్దో నిర్ణయించుకునే హక్కు ఆమెకు వుంటుందని ఇది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘనే అని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.