తొలి క్యాబినెట్ భేటీలోనే ఎన్డీయే ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. హడావిడిగా పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. నాయుడుద్వయం చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ఈ కుట్రలో ప్రధాన పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యమే. కేంద్రం తీసుకున్న ఆదరాబాదరా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా బంద్ ను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణ ప్రజలకు సూచించారు.
ఈ విషయమై కేసీఆర్ బుధవారం గవర్నర్ నరసింహన్ ను కలిసి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు జరగనున్న అన్యాయంపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు అప్రజాస్వామికంగా కేంద్రప్రభుత్వం ఆమోదించిన ఆర్డినెన్స్ ను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ద్వారా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే పార్లమెంటు సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదిస్తారా? లేక పెండింగ్ లో ఉంచుతారా? అనేది తెలియాల్సిఉంది.
మోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ భేటీలోనే కుట్రలకు పాల్పడటం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. అత్యంత రహస్యంగా పోలవరంపై ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నప్పటికీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోలవరంపై ఎలాంటి చర్చ జరగలేదని దాటవేసినా బుధవారం కుట్ర బయటపడింది. బుధవారం ఉదయమే ఆర్డినెన్స్ కాపీ అందిందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి పోలవరం ముంపు గ్రామాలను కొత్తగా చేరుస్తూ ఆర్డినెన్స్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిగి మళ్ళీ ఆర్టికల్ 3 ప్రకారమే చేయాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.