mt_logo

ఈ సైకోలతో ఎలావేగారని అంటున్నారు: హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతలు మాట్లాడే మాటల్లో నిజం లేదని,వితండవాదం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంటులో గొడవ జరిగితే బిల్లు ఎలా ఆమోదం పొందుతుందని వాదిస్తున్నారని, అసెంబ్లీలో గొడవ మధ్యే మూజువాణి ఓటుతో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎలా ఆమోదించుకున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు ఆర్డర్ లో లేనప్పుడు బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేదని కొందరు సమైక్యవాదులు పసలేని మాటలు చెప్పడం అర్థరహితమన్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కూడా సభ ఆర్డర్లో లేదని, గందరగోళ పరిస్థితుల మధ్యే మూజువాణి ఓటుతో విభజన బిల్లును ఆమోదించారని గుర్తు చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై చర్చ జరిగేటప్పుడు పార్లమెంటులో ఆర్జేడీ ఎంపీలు రఘువంశప్రసాద్, సురేంద్రప్రసాద్ లు అద్వానీ పైనే దాడికి ప్రయత్నించారని వివరించారు. ఆ గొడవ రికార్డుల్లో కూడా ఉందని, ఉత్తరాంచల్ విషయంలోనూ ఇలాంటి రాద్ధాంతమే జరిగిందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో మూడు రాష్ట్రాల విభజన జరగలేదని స్పష్టం చేశారు. విభజనను వ్యతిరేకిస్తున్న వారి అనుమతి తీసుకోవాలని షరతు పెట్టడమంటే వన్యప్రాణి రక్షణకు వేటగాడి అనుమతి తీసుకోవడమేనని విమర్శించారు. పార్లమెంటులో దాడి చూసిన తర్వాత అక్కడి జాతీయ నేతలు ఆశ్చర్యంతో ఇలాంటి సైకోలతో ఇన్నాళ్ళూ ఎలా నెట్టుకొచ్చారని అడుగుతున్నారని, చంద్రబాబు, జగన్, కిరణ్ కుమార్ రెడ్డిలను జాతీయ స్థాయిలో ఎవరూ పట్టించుకోవట్లేదని హరీష్ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *