mt_logo

ట్రిమ్ చేసిన మీసాలు తిప్పినా, గోకినా ఒకటే!!

BY: సవాల్‌రెడ్డి

కపి రపిచ…కాపి శాయన మదమత్తో
వృశ్చికేన సందష్టః..అపిచ పిశాచగ్రస్తః
కిం బ్రూమో వైకృతం తస్య!
అసలే కోతి. కల్లుత్రాగి మత్తులో ఉన్నది. అటుపై తేలు కుట్టినది. పిదప పిశాచమూ ఆవహించినది. ఇంక.. దాని వికారాలు ఏమని చెప్పేది?.. కిం బ్రూమో వైకృతం తస్య?!

సీమాంధ్ర మీడియా పండుగ
సీమాంధ్ర మీడియా మళ్లీ పండుగ చేసుకుంటున్నది. ఇప్పుడు పండగేంటి? అని తిథులు, నక్షత్రాలు, పంచాంగాలు చూడనక్కరలేదు. కేసీఆర్‌కు, తెలంగాణకు, తెలంగాణ ప్రభుత్వానికి ఏ సమస్య వచ్చినా అది సదరు మీడియాకు గొప్ప పండుగే. కేసీఆర్ కాలుకు ముల్లుగుచ్చితే వాటికి సంక్రాంతి. టీఆర్‌ఎస్ నుంచి ఎవరైనా నిష్క్రమిస్తే అది ఉగాది. తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎవడో ఏదో మాట్లాడితే అది అట్లతద్ది.. ఏరువాక.. కోర్టుల్లో ప్రభుత్వం ఓ అపజయాన్ని ఎదుర్కుంటే దీపావళి. కావాలంటే ఆయా సందర్భాల్లో చూడండి. సదరు మీడియా యాంకర్ల ముఖాల్లో ఎన్ని వెలుగులు కనిపిస్తాయో. వాయిర్ ఓవర్లు ఎన్ని ఓవరాక్షన్లు పోతాయో. ఏతావాతా తేలేదేమంటే.. సీమాంధ్ర మీడియా తెలంగాణ నట్టింట్లో మొలిచిన ఓ ఉప్పలం.. నడిమింట్లో దూలాన్ని పట్టుకున్న ఓ గబ్బిలం. పెద్దలు చెప్తారు.. ఉప్పలము, గబ్బిలము రెండూ ఇంటికి శుభం కాదని… దరిద్రం ఏమిటంటే అవి తొందరగా వదలనూ వదలవు.

14 ఏండ్లుగా హీరోల కోసం వెతుకులాట..
పాపం.. సీమాంధ్ర మీడియా ప్రతి అంగుష్ఠమాత్రుడిలోనూ కేసీఆర్‌ను దెబ్బకొట్టే మొనగాడిని చూస్తూనే ఉంటుంది. భూమికి జానెడు లేనోడు కూడా వారికి పులిలాగా.. పులిబిడ్డలాగా కనిపిస్తుంటాడు. ఎవరో ఒకర్ని చూసేయడం తాము వెతుకుతున్న హీరో ఆయనే అనుకుని మనసు పారేసుకోవడం… ఆశాభంగం చెందడం సీమాంధ్ర మీడియాకు ఆనవాయితీగా మారిపోయింది. ఏ హీరో అయినా ఉండేది కొద్ది రోజులే. మళ్లీ హీరోకోసం వెతుకులాట. హీరోలు మారుతున్నారు గానీ పాపం మీడియా కలే నెరవేరడం లేదు. ఈ వరుసలో ఎందరని…? 2004 తర్వాత సంతోష్‌రెడ్డి ఎదురుతిరిగి ఓ దుకాణం పెట్టినపుడు సరిగ్గా ఇవాళ్టిలాగే చంకలు గుద్దుకున్నారు. దెబ్బకు టీఆర్‌ఎస్ ఢాం అనుకున్నారు.

అది నెరవేరలేదు. తర్వాత గోనె ప్రకాశరావు… పాపం చాలా రోజులు సీమాంధ్ర మీడియాకు.. సీమాంధ్రులకు హీరో. స్టూడియోల్లో కూచోబెట్టుకుని కేసీఆర్‌ను తనివితీరా తిట్టించుకుని వీనులవిందు చేసుకున్నారు. ఆ తర్వాత మందాడి.. ఆయనతో పద్యాలు అవీ కూడా పాడించుకుని పరవశించిపోయారు. కేసీఆర్‌కు మాటలే వచ్చు.. మా మందాడికి పాటలు కూడా వచ్చు అని పరవశించిపోయారు. శారారాణి తిట్టడం రాక వెనకబడింది కానీ.. ఆమెకు స్టూడియోల్లో ఓ సీటు కన్‌ఫర్మ్ చేసి ఉండేవాళ్లు. ఆ లోటును దుగ్యాల పూడ్చేశారు. ఉద్యమనాయకుడిని ఎన్ని మాటలు అనిపించాలో అన్నీ అనిపించారు. తర్వాత టీడీపీ తరపున నాగం బండి లాగారు.

ఈ మధ్యలో విజయవాడనుంచి లగడపాటి, కర్నూలు నుంచి టీజీ వెంకటేశ్, మారెప్ప, అనంతపూర్‌ నుంచి జేసీ దివాకర్‌రెడ్డి, శైలజానాథ్, నెల్లూరునుంచి ఆనంను దింపించి స్టూడియోలను పావనం చేసుకున్నారు. ఉద్యమ ప్రస్థానంలో ఎత్తుపల్లాలు ఎదురైన సమయంలో తిట్టినవాడల్లా హీరోయే. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ నవతెలంగాణ ఓ గొప్ప ఎపిసోడ్. కులాల లెక్కలు అవీ వేసి ఇక టీఆర్‌ఎస్ దుకాణం ఎత్తేయడమేనంటూ వ్యాఖ్యానాలు చేశారు. అదీ అయిపోయింది. ఆఖరుకు గద్దర్ ఉద్యమంలోకి వస్తున్నాననగానే ఎన్ని గంతులు.. ఎన్ని వ్యాఖ్యానాలు. కేసీఆర్ కాళ్ల కింద భూమి కదిలిపోయిందన్నారు. దుకాణం కల్లాస్ అన్నారు.

ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమకారులను ఒక వేదిక మీదికి తీసుకురావాలనే సదుద్దేశంతో వస్తే ఆయనకు లేని ఉద్దేశ్యాలు ఆపాదిస్తూ.. ఈసారి కేసీఆర్ ఖచ్చితంగా అవుటేనని ఎలుగెత్తి చాటారు. చివరకు పాలమూరులో బీజేపీ గెలిచినపుడు కిషన్‌రెడ్డిలో కూడా కేసీఆర్‌ను పక్కకు పెట్టే మహాయోధుడిని దర్శించి తరించిపోయారు. పాలమూరులో మొదలైన ప్రచారం పరకాలకు చేరేసరికి అంచనాలు పటాపంచలు కాగా ఆశలన్నీ తునాతునకలయ్యాయి. ఇలా ఈ వరుసలో నర్సింహులు, ఎర్రబెల్లి… లిస్టు చాలా పెద్దది. పార్టీలో విభేదాలతో రఘునందన్‌రావు వెళ్లిపోతే గంటలకు గంటలు ఇంటర్వ్యూలు. లైవ్ కవరేజీలు. ఆయన తన దగ్గరేదో టేపులున్నాయనడం. వాటితో టీఆర్‌ఎస్ ఖతమా? అంటూ మీడియా వ్యాఖ్యానాలు.. వారం రోజుల తర్వాత రఘులేడు.. టేపులు లేవు. మళ్లీ హీరో కోసం వేట. సీమాంధ్ర మీడియా అంచనాలు ఎంత గొప్పవంటే తెలంగాణ సాధించి కేసీఆర్ విశ్వరూపం చూపుతున్న సమయంలో కూడా గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమా? అంటూ ప్రచారాలు సాగించాయి. కేసీఆర్‌ను ఓడించే మగాడిని గజ్వేల్ టీడీపీ అభ్యర్థిలో దర్శించాయి.

కొత్త పులకేశి..
ఇలా ఇప్పటిదాకా మీడియా మోసిన వందమంది పులకేశిలకు.. ఇవాళ ఇంకో కొత్త పులకేశి తోడయ్యాడు.. నూటొక్క నెంబర్ పులకేశి. పులిబిడ్డ అని పేరుపెట్టి వదిలిన సదరు మీడియాకు తెలుసో.. తెలియదో? ఇక్కడ క్రూరమృగాలను సైతం సర్కస్ ఆట ఆడించే రింగ్‌మాస్టర్ ఉన్నాడని. ఆ మాస్టర్ కొట్టిన దెబ్బకు సదరు బాస్ పదేండ్లు రోడ్లు పట్టుకుతిరిగాడని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి అవశేష ఆంధ్రప్రదేశ్ అనే ముక్క ఆయన బతుకై పోయిందని. బాసే దిక్కులేక బస్సుల్లో తలదాచుకుంటుంటే… ఎస్ బాస్ లను అడిగేవాడెవ్వడు?! అయినా ఆవుపాడి ఎన్నాళ్లు?.. ఐశ్వర్యం ఎన్నాళ్లు? బర్రెపాడి ఎన్నాళ్లు?.. భాగ్యం ఎన్నాళ్లు? అన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త హీరోలను వెతికే సీమాంధ్ర మీడియా ఈ కొత్త పులకేశిని ఎన్నాళ్లు మోస్తుందని?!

చూడని ప్రతాపాలా..?
ఏదో పాత పౌరాణిక సినిమాలో చూశాం. ఉత్తరకుమారుడు కోటలో కోతలు కోస్తుంటాడు. వాడిని నిర్జిస్తాను, వీడిని తరిమి కొడతాను, చెలరేగి పోతాను అని. చుట్టూ ఉండేవాళ్లు భృత్యులు, ఆశ్రితులు కాబట్టి చప్పట్లు కొడుతుంటే రెచ్చిపోయి ప్రతిజ్ఞలు చేస్తాడు. తీరా యుద్ధభూమికి వెళ్లగానే బతికియుండిన శుభములు బడయవచ్చు.. అని వెనక్కి చూడకుండా పారిపోతాడు. ఇందులో నీతి ఏమిటంటే అద్దె మనుషులను చుట్టూ పెట్టుకుని ఎన్ని కోతలైనా కోయవచ్చు. జనాలను చూసి రెచ్చిపోవచ్చు. మాటలు కోటలు దాటించవచ్చు. ప్రతిజ్ఞలు అవీ చేసేయవచ్చు. భారీ భారీ పంచ్ డైలాగులు విసరనూ వచ్చు. అంతమాత్రం చేత ఎవరూ గొప్పవారై పోరు. వట్టి గొడ్డుకు అరుపులు మెండు.. వరపుటేటికి(కరువుకాలానికి) మెరుపులు మెండు అన్నారు పెద్దలు.

వీరాలాపాలతో పని జరిగిపోదు. ఎవరి వీరత్వం ఏమిటో ఇప్పటికే అసెంబ్లీ రెండుసార్లు చూసింది. మెదక్ ఉప ఎన్నిక ఫలితం ఎవరి కెపాసిటీ ఏమిటో ఎపుడో చూపించింది. అయినా మీసం తిప్పడం అంటే ఏ బాపిరాజో.. నాయిని నర్సింహారెడ్డో తిప్పారంటే అర్థం ఉంది. అవి బారెడంత ఉంటాయి. చేతులకు వేళ్లకు బాగా అందుతాయి. పట్టుకుని లాగి చూపవచ్చు. మెలితిప్పి సవాలు చేయవచ్చు. ట్రిమ్మింగు కొట్టిన మీసాల్లో ఏముంటుంది. చేతికీ తగలవు. వేళ్ల మధ్యా నిలవవు. తిప్పినా గోకినా ఒక్కటే.

భ్రమాత్మక భవిష్యత్తు..
మాయోపాయాలు, దుష్టరాజకీయాల్లో బాస్ దగ్గర ఈ ఎస్‌బాస్ శిక్షణ పొంది ఉండవచ్చు. షార్ట్‌కట్‌లో అర్జంటుగా పెద్దసీటులో కూర్చోవచ్చని కలలు కంటూ ఉండవచ్చు. కానీ జయశంకర్ వంటి అధ్యాపకుల దగ్గర తెలంగాణ ప్రజలు ఎపుడో రాటుతేలారు. బాస్‌లు, ఎస్‌బాస్‌ల చిల్లర ఎత్తుగడలు ఇక్కడ పనిచేయవు. బాబ్లీ నాటకాలతో సహా అనేక విషయాల్లో ఇప్పటికే నూటొక్కసార్లు ఆ విషయం నిజమైంది. అయినా.. మామను పడగొట్టిన వేళ ఆయుధంగా వాడుకున్న తోడల్లుడిని శంకరగిరి మాన్యాలు పట్టించిన వాడు… తండ్రినుంచి చీల్చి తెచ్చిన కొడుకును.. ఆయన కొడుకును కూడా వాడుకుని, వాడుకుని తరిమేసినవాడు.. కేసీఆర్‌ను తిట్టించి తిట్టించి వాడుకున్న గవర్నర్ బిరుదాంకితుడిని.. మహానాడు మైకులో పదవి అడుక్కునే స్థితికి తెచ్చినవాడు… ఎప్పుడో నాలుగేండ్లు వాడుకున్న తర్వాత నిజంగా పదవి ఇస్తాడా? పల్లులు, బల్లులు ఇవ్వనిస్తాయా? అనేది స్థిమితంగా ఒక్క నిమిషం ఆలోచించినా బోధపడుతుంది. ప్రపంచ యోగాసన దినోత్సవం చర్లపల్లి జైలులో చేయించారో లేదో మనకు తెలియదు. చేయించి ఉంటే కనీసం రిమాండ్ ఖైదీలకైనా మేలు జరిగిఉండేది కదా!

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *