మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ లో రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం అంటే మూడు రకాలని, అవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ సచివాలయం అని చెప్పారు.
స్థానిక సంస్థలను స్థానిక సచివాలయాలుగా అభివృద్ధి చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో గ్రామ సచివాలయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో గ్రామ సచివాలయాల పద్ధతిని అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని పంచాయితీలన్నిట్నీ కంప్యూటరీకరణ చేసి ఈ-పంచాయితీలుగా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని సర్పంచ్ లకే అప్పగించబోతున్నామని, దీంతో నిరుపేదలకు వందరోజుల పని దొరుకుతుందని హరీష్ రావు తెలిపారు.
పోలవరం పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలతో పాటు 450మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రా సీఎం చంద్రబాబు ఏపీకి చెందేలా చేశారని, తెలంగాణ వాటాలో 1.2శాతం తగ్గించారని మండిపడ్డారు. గత రెండు, మూడు రోజులుగా తీవ్ర విద్యుత్ సమస్య ఉత్పన్నమవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళామని, దీంతో సీఎం వెంటనే స్పందించి నాప్తా బేజ్డ్ పద్ధతిలో 12రూపాయలకు ఒక యూనిట్ చొప్పున 350మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రెండు మూడేళ్ళలో విద్యుత్ ను సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని హరీష్ రావు వివరించారు.