రాజకీయ అవినీతికి, పైరవీకి దూరంగా ఉంటూ ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పాటుబడాలని, ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జెడ్పీ చైర్ పర్సన్ల ఎన్నికల్లో గెలుపొందిన కరీంనగర్, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్లు తుల ఉమ, పద్మలు ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకోగా వారికి సీఎం అభినందనలు తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, తెలంగాణ రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ సార్ధకం కావాలంటే సర్పంచ్ నుండి సీఎం దాకా అందరూ కష్టపడాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేకుండా అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని, టీఆర్ఎస్ తరపున కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను మంచి ప్రజాసేవకులుగా తయారు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.