మీరెప్పుడైనా గమనించారో లేదో, సీమాంధ్రలో సమైక్యాంధ్ర సభ ఏది జరిగినా మన సీమాంధ్ర పత్రికలు కేవలం స్టేజీ మీదున్న పదిమంది నాయకుల ఫొటోనే ఇస్తాయి. అక్కడేదో భూమీ ఆకాశం ఏకమైననత సభ జరిగిన బిల్డప్ ఇస్తాయి. కానీ నిజంగా జరిగేది ఏమిటంటే స్టేజీ ఎదుట ఎప్పుడూ వందమందికి మించి ఉండరు. అందుకె ఎందుకైనా సేఫ్ అని చాలా మీటింగులు కార్పొరేట్ కాలేజీల్లోనే లాగించేస్తారు. అక్కడైతే “క్యాప్టివ్ ఆడియన్స్” ఉంటుందని ధీమా.
నిన్న విశాఖపట్నంలో జరిగిన సమైక్యాంధ్ర మీటింగులో కూడా అదే కథ రిఫీటయ్యింది.
కావూరి, తమ్మినేని వంటి నాయకులంతా ఈ సభకు హాజరయ్యి తెలంగాణ ఇస్తే ప్రళయం వస్తుందని హడవిడి చేశారు. యధాప్రకారం ఈనాడు, పచ్చజ్యోతి. జగన్ సాక్షి అన్నీ ఈ వార్తకు స్టేజీ ఫోటోనే వేశాయి. పాపం ఒక చిన్న పత్రిక ఫొటోగ్రాఫర్ అతి కష్టమ్మీద సభకు హాజరయిన వాళ్ల ఫొటో తీయగలిగాడు. సదరు దినపత్రిక దీన్ని తన జిల్లా ఎడిషన్లో ఒక మూలకు చిన్నగా, గుండ్రంగా కత్తిరించి మరీ వేసింది.
పట్టుమని వందమంది లేని ఈ జనాన్ని చూస్తే సమైక్యాంధ్ర భావన ప్రజల్లో ఎంతుందో ఇట్టే అర్థం అవుతుంది.
మన సందు చివర పెట్టే తెలంగాణ సభల్లో ఇంతకు అయిదింతల మంది జనం వస్తారు. కడుపులో లేనిది కావలించుకుంటే వస్తదా అని, ప్రజల్లో లేని సమైక్యత పేరిట ఉద్యమం చేయబోతే ఇట్లాకాక మరెట్లా ఉంటది?
మొన్న సెప్టెంబర్ 30 నాడు, అడుగడుగునా ఆంక్షలను ఎదిరించి లక్షలాది మంది తెలంగాణ మార్చ్ కు తరలి వస్తే, తెల్లారి పత్రికల్లో ఫొటోలు పట్టుకుని, వాటి మీద చదరాలు గీసి, సభకు వచ్చిన జనాలు కొద్ది వేల మందే అని అడ్డగోలు వాదనలు చేసిన లగడపాటి, పరకాల ఇప్పుడెక్కడ పెట్టుకుంటారో తలకాయలు.