mt_logo

సమైక్య వైఫల్యం

By: పసునూరు శ్రీధర్ బాబు

సీమాంధ్ర ఉద్యమానికి చోదకశక్తిగా పని చేస్తున్న భావోద్వేగాలలో సహేతుకత లేదన్నదే నా వాదన. అంతేకానీ, అందులోని ప్రజల భాగస్వామ్యాన్ని, నిజాయతీని శంకించడం లేదు. ఉద్యమం నిజమైనది కాబట్టి దాని లక్ష్యం ఉదాత్తమైనదని అనుకోవాల్సిన పని లేదు. పొరుగువాడికి ఇష్టం లేని సహజీవనాన్ని బలవంతపెట్టడం దాష్టీకం. ఇది వ్యక్తి స్థాయిలో అయితే జుత్తు పట్టుకుని నాతోనే ఉండన్నట్లుగా ఉంటుంది. సమాజంలో ఒక్కోసారి ఇలా ఉద్యమంలా గందరగోళపరుస్తుంది. ఇద్దరికీ పడనప్పుడు పంపకాల గురించి మాట్లాడాలి. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు. మరొకరి మీద హక్కు కోసం పోరాడకు. అలాంటి పోరాటానికి చరిత్రలో ఉద్యమ గౌరవం లభించదు.

నిజానికి, సీమాంధ్ర ఉద్యమం సమైక్యతను ఇంతవరకూ నిర్వచించలేదు. హైదరాబాదు అభివృద్ధిలో తన భాగస్వామ్వాన్ని మాత్రమే క్లెయిమ్ చేస్తోంది. చర్చ అంతవరకు పరిమితమైతే సమస్య లేదు. పరిష్కరించుకోవచ్చు. సమైక్యమనే ఇల్లాజికల్ కంక్లూజన్ లో వారికే నచ్చని అంశమేదో వారిని ఆగ్రహానికి గురి చేస్తోంది. ఆ ఆగ్రహంతోనే వారు తెలంగాణ ప్రతీకలుగా కేసీఆర్, సోనియాల దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు. సమాధులు కడ్తున్నారు. పిండాలు పెడుతున్నారు. అంటే, ద్వేషాన్నే పెంచుతున్నారు. సమైక్య ఉద్యమం లక్ష్యం అదేనా? ఉద్యమ వ్యక్తీకరణలో అలాంటివి ఉండకుండా ఉన్టాయా అంటే మన సమాజంలో ఉంటూనే ఉన్నాయి.ఇక్కడి తెలంగాణ ఉద్యమంలో అలాంటివి లేవనేమీ గుడ్డిగా వాదించడం లేదు. ఉద్వమ స్వభావం ఏదైనా, స్వరూపాన్ని మాత్రం ఆ జాతి నాగరిక స్థాయి నిర్దేశిస్తుంది. ఆ కోణంలో మన తెలుగువాళ్ళమంతా ఒక్కటే.

కానీ, సీమాంధ్రులు నిజంగా చేస్తున్నది సమైక్య రాష్ట్ర ఉద్యమమే అయితే అది సఖ్యతను పెంచడానికి దోహదపడాలి. సఖ్యతను పెంచడానికి చేయాల్సిన ఉద్యమం ఉదాత్తమైనది. దాని స్వరూపం కూడా ఉదాత్తంగా ఉండాలి. వెళ్ళిపోతానన్నవాడు పెడసరంగా మాట్లాడినా కూడా కలసి ఉండాలని కోరుకునేవాడు అనునయిస్తూ మాట్లాడాలి. వెళ్ళిపోతానన్న వాడి గాయాన్ని పరామర్శించగలగాలి. అంత ఔన్నత్యం ఈ ఉద్యమానికి లేదు. అసలలాంటి అవకాశం ఉంటుందని కూడా సీమాంధ్ర గుర్తించలేదు. పుష్కరకాల మౌనం, 2009 డిసెంబర్ 9 నిర్ణయం తరువాత సామూహిక రాజీనామాల అఘాయిత్యాలే అందుకు నిదర్శనం. ఇప్పుటికీ, రాష్ట్ర విభజనకు మూల కారణాలను గుర్తించకుండా కేసీఆర్ సమైక్య ద్రోహి, సోనియా వంచకురాలు, రాహుల్ ను ప్రధాని చేయడానికే ఈ కుట్ర అంటూ తెలంగాణ కాజ్ ను మరింత చులకన చేస్తోంది సీమాంధ్ర ఉద్యమ నాయకత్వం. కాదూ కూడదంటే హైదరాబాద్ సంగతేమిటో తేల్చుకుందామని సవాళ్ళు విసురుతున్నారు. కొత్తగా వజ్రాల మూటల కథలు ప్రచారం చేస్తున్నారు. ఇట్లా సాగుతోంది సమైక్య సమరం.

ఒక్క తెలంగాణవాదినికూడా పునరాలోచనలో పడేయలేని సమైక్య ఉద్యమం నిష్ఫలమే కదా?

భౌగోళిక విభజనను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్రులు సమైక్యతను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *