మొత్తానికి చెప్పుదెబ్బలు తింటే కానీ టీజీ వెంకటేశ్ కు సమైక్యాంధ్ర తత్వం బోధపడలేదు.
ఇవ్వాళ సాయంత్రం సీమాంధ్ర మంత్రుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో రౌడీ మూకలు చేరాయని అన్నారు.
నిన్న కర్నూల్ లో ఒక హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన టీజీపై కొందరు ఆందోళనకారులు చెప్పులు విసిరారు.
మొదటి నుండీ తాను సమైక్యాంధ్రవాదినేనని టీజీ ఎంత మొత్తుకున్నా వారు వినలేదు. మొన్న హైదరాబాదులో APNGOల సభ సజావుగా జరగడానికి ఏర్పాట్లు చేసింది కూడా తామేనని అసలు రహస్యం చెప్పేసినా వచ్చిన ఆందోళనకారులు శాంతించలేదు.
దీంతో చిర్రెత్తిన ఆయన మీసం మెలేసి “చూసుకుందాం అంటే చూసుకుందాం” అని వచ్చిన ఆందోళనకారులకు సవాల్ విసిరాడు.
ఇవ్వాళ జరిగిన ప్రెస్ మీట్ లో సమైక్య ఉద్యమంలో రౌడీ మూకలు చేరాయని కుండబద్దలు కొట్టాడు టీజీ వెంకటేశ్. సమైక్య ఉద్యమం ముసుగులో జేయేసీలు తమపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటు హెచ్చరిక జారీచేశాడాయన.