తెలంగాణది బతుకు పోరాటం, సమైక్య ఆందోళనలు మాత్రం హైదరాబాద్ కోసమేనని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో “తెలంగాణ ఉద్యమం – ప్రస్తుత పరిణామాలు” అనే అంశంపై జరిగిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. అనంతరం హైదరాబాద్ తిరిగొస్తూ భువనగిరి టౌనులో విలేకరులతో కూడా ఆయన మాట్లాడారు.
తెలంగాణ కోసం ఇప్పటికే వెయ్యి మందికి పైగా ప్రాణాలర్పించారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కోసం శాంతియుత ఉద్యమం జరుగుతుండడం వల్లనే కేంద్రం దిగొచ్చి రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు.
దశాబ్దాల తరబడి తెలంగాణపై పెత్తనం, దోపిడీకి అలవాటు పడ్డ సీమాంధ్ర నేతలు కలిసుండాలనడం యాసిడ్ దాడేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు విభజన ప్రక్రియ వేగవంతమయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. యూటీ ముచ్చటే లేదని, పది జిల్లాలతో కూడిన తెలంగాణకే ఒప్పుకుంటామన్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలను జీహెచ్ ఎంసీ లో విలీనానికి వ్యతిరేకంగా పోరాటం జరుపుతామని కోదండరాం అన్నారు.
తెలంగాణ వచ్చేవరకు పోరాటాన్ని ఆపేదిలేదని, ఇందులో భాగంగానే ఈ నెల 29 న హైదరాబాద్ లో నిర్వహించే “సకలజన భేరి” సభను ఏర్పాటు చేసామని, దీనికి మహిళలంతా హాజరు కావాలని సూచించారు.