mt_logo

సమగ్రాభివృద్ధే లక్ష్యం

-అవినీతికి తావులేని పారిశ్రామిక విధానం
-రూ.50 కోట్ల వరకూ కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు..
-రూ.200కోట్ల వరకూ రాష్ట్రస్థాయిలో మూడేళ్ల తర్వాత మిగులు విద్యుత్ సాధించాలి
-హైదరాబాద్ శివారులో అక్రమిత భూములను వెనక్కు తీసుకోండి
-చెరువుల పునరుద్ధరణ ఉద్యమంగా చేపట్టాలి..
-అధికారులకు మార్గదర్శనం చేసిన సీఎం కేసీఆర్
-తుది మెరుగుల్లో పారిశ్రామిక విధానం
-నేడు పారిశ్రామికవేత్తలతో చివరి సమావేశం
-వచ్చే క్యాబినెట్ సమావేశం ముందుకు ముసాయిదా

రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అభివృద్ధి ప్రక్రియలతో అన్ని రంగాలు పోటీ పడాలన్నారు. పారిశ్రామికాభివృద్ధితో పాటు పట్టణాలు, గ్రామాల అభివృద్ధి సమాంతరంగా దౌడుతీయాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పట్టణాలు, గ్రామాలతో పాటు, పరిశ్రమలపై కూడా దృష్టి పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్)లో కీలక శాఖల ఉన్నతాధికారులతో ఐదు గంటలకు పైగా సమావేశం జరిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశంలో తుదిరూపు ఇచ్చిన డ్రాప్టుపాలసీపై వివిధ శాఖల అధికారుల సూచనలు సలహాలు స్వీకరించారు. దానితో పాటు హైదరాబాద్ నగరాభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్రపై చర్చించారు. విద్యుత్ కోతల అంశాన్ని కూడా చర్చించి వ్యవసాయానికి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేసేందుకు సత్వరం. ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

పారిశ్రామిక విధానం సిద్ధం
నూతన పారిశ్రామిక విధానంలో అవినీతికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక విధానంపై రూపొందించిన ముసాయిదాపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు జిల్లా కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు ఇవ్వాలని, రూ.200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర స్థాయిలో అనుమతులు ఇవ్వాలని సూచించారు. కొన్ని రకాల పరిశ్రమల స్థాపనకు అవసరం లేని అనుమతుల విషయంలో మినహాయింపులను ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం కాలుష్య సమస్య లేని పరిశ్రమలు, సేవా రంగానికి సంబంధించిన పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు.

పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర ప్రభుత్వం అనుసరించనున్న విధి విధానాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామిక రంగానికి అనుబంధంగా ఉండే పంచాయత్‌రాజ్, నీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్తు, న్యాయ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు వివరించారు. పాలసీలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదన్న సీఎం ఆలోచనతో సింగిల్‌విండో విధానం, స్పెషల్ ఛేజింగ్ సెల్, రాయితీలు, ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో సంబంధిత శాఖల అభిప్రాయాలను సేకరించారు. సోమవారం సెలెక్టెడ్ ఇండస్ట్ట్రియల్ వర్గాలతో పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర ఆఖరి భేటీ జరిపి పాలసీడ్రాప్టును సీఎంకు సమర్పిస్తారు. వచ్చే నెలలో జరుగనున్న మంత్రివర్గ సమావేశం ముందు పాలసీ డ్రాప్టును ఉంచనున్నారు.

చెరువుల పునరుద్ధరణతోనే అభివృద్ధి..
గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధరణను ఒక ఉద్యమంగా చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటికి కీలక ఆధారం చెరువులేనని ఆయన అన్నారు. ఇప్పటి వరకు చెరువులపై పాలకులు దృష్టి సారించకపోవడంతోనే తెలంగాణకు నీటి సమస్య వచ్చిందన్నారు. చెరువులను పునరుద్ధరిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సాగునీటి సౌకర్యాలు తక్కువగా ఉన్న తెలంగాణ రైతాంగానికి చెరువులే పెద్ద ఆధారమని, దీనిపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టితో పనిచేయాలని సీఎం మార్గదర్శనం చేశారు.

సర్పంచులను తీర్చిదిద్దాలి..
గ్రామాలను, పంచాయతీలను బలోపేతం చేయడానికి సర్పంచ్‌లను కీలక నాయకులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. గ్రామ పంచాయతీలకు పన్నుల వసూలుతో పాటు, అధికారాలు, బాధ్యతలను కూడా అప్పగించి సర్పంచ్‌ను గ్రామీణ స్థాయి కీలక నాయకునిగా తయారు చేయాలని అన్నారు. ఇప్పటి వరకు గ్రామాలను, గ్రామ సర్పంచ్‌లను పెద్దగా పట్టించుకోలేదని, ఇక నుంచి సర్పంచ్‌లను కీలకమైన నేతలుగా రూపొందించాలని సీఎం అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌కు ఎంతో చేయాల్సి ఉంది..
హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉందని సీఎం అన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, రవాణా వ్యస్థను బాగా మెరుగు పర్చాల్సి ఉందని సంబంధిత శాఖాధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల అన్యాక్రాంతమైన విలువైన భూములను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవిన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నాయని, కోర్టు వివాదాల్లో ఉన్న ఆ భూముల కేసులను త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా, మిగులు భూములను వేలం ద్వారా విక్రయించి వచ్చిన డబ్బులను అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలని సీఎం భావిస్తున్నారు.

విద్యుత్ సమస్యపై సీఎస్ సమీక్ష
ఆదివారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలంగాణ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ కార్తికేయమిశ్రా, సదరన్ పవర్ డిస్కమ్ ఇన్‌ఛార్జి సీఎండీ రఘుమారెడ్డి, నార్తరన్ పవర్ డిస్కమ్ సీఎండీ వెంకటనారాయణలతో విద్యుత్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా, రెవెన్యూ వసూళ్ళ తీరుతెన్నులను సీఎస్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని డిస్కమ్‌ల సీఎండీలు సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీఎస్) విద్యుత్ ఉత్పత్తిలో ఎవ్వరికీ కేటాయించని విద్యుత్తును కనీసం 500 మెగావాట్లు తెలంగాణకు తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, ఓపెన్ మార్కెట్ లేదా పవర్ ఎక్సేంజ్‌లో విద్యుత్తును కొనుగోలు చేయడం, ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం వంటి అంశాలను జెన్‌కో సీఎండీ ప్రస్తావించినట్లు సమాచారం.

విద్యుత్ ప్రణాళిక తయారు చేయండి..
రాష్ట్రంలో పంటలు కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మరో 15రోజుల్లో ఖరీఫ్ పంటలు కోతకు వచ్చే అవకాశమున్నందున ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ పై పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఎట్టి పరిస్థితిలోనూ విద్యుత్ సమస్యను అధిగమించి, మిగులు విద్యుత్ ఉండేలా ప్రణాళికను తయారు చేయాలని చెప్పారు. ఈ వ్యవధిలో విద్యుత్ కొరతను క్రమక్రమంగా అధిగమించాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ప్రస్తుతం విద్యుత్‌లోటు 20 మిలియన్ యూనిట్ల మేరకు ఉందని, అవసరాల మేరకు ఎక్కడ అందుబాటులో ఉన్నా విద్యుత్ కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఇంధన శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి వివరించారు.

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీఎంఓ ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగరావు, రెవిన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *