ఈనెల 19న ప్రభుత్వం చేపట్టబోయే సమగ్ర సర్వేకు ప్రజలందరూ అర్ధగంట సమయాన్ని కేటాయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సర్వేజనా సుఖినోభవంతు అనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, సకల జన హితం కోసమే పని చేస్తుందని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈనెల 19న సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.
మంగళవారం నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ సర్వేపై మీడియా ప్రతినిధులు అడిగిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. స్థానికతను నిర్ధారించడానికి, రేషన్ కార్డులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పించన్లు కుదించడానికే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు కక్షతో విషప్రచారం చేస్తున్నాయని అన్నారు.
గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదనే ఈ సర్వే నిర్వహిస్తున్నామని, కుటుంబాల సమాచారం, బీసీల జనాభా గణాంకాలు, రాష్ట్రంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అనే సమాచారం ప్రభుత్వం వద్ద లేదని, ఈ సర్వేతో రాష్ట్ర సమగ్ర సమాచారం లభిస్తుందని కేటీఆర్ వివరించారు. ఈనెల సర్వే జరగనున్న 19వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున పౌరులందరూ సర్వేలో విధిగా పాల్గొనాలని, విపత్కర పరిస్థితుల్లో సర్వేలో పాల్గొనలేక పోయిన వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై సర్వే పూర్తయిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.