సోమవారం సచివాలయంలో వరంగల్ టెక్స్ టైల్ పార్క్, కేజీ టు పీజీ విద్యావిధానాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సకల వస్త్ర ఉత్పత్తుల సమగ్ర సమ్మేళనంగా వరంగల్ టెక్స్ టైల్ పార్క్ ఉండాలని, ఉత్పత్తి చేసిన వస్త్రాలను అక్కడే విక్రయించేలా మార్కెట్ సదుపాయం కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు. పార్కుకు తుదిరూపు ఇచ్చేముందు సూరత్, సోలాపూర్, తిర్పూరుల్లో వస్త్ర పరిశ్రమను వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఒక బృందం అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. వరంగల్ నగరం చుట్టూ ప్రభుత్వ భూములు సేకరించామని, వాటిలోనే టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు అవుతుందని, ఈ పార్కు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని సీఎం తెలిపారు.
అనంతరం కేజీ టు పీజీ విద్యా విధానాలపై జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ, విద్యావిధానాన్ని ఆషామాషీగా తీసుకోమని, మొత్తం సమాజంతో ముడిపడ్డ ఈ అంశంపై విస్తృతస్థాయి చర్చ కోసం త్వరలో విద్యారంగంలో అనుభవం ఉన్నవారు, విద్యావంతులు, ఎస్ సీఈఆర్టీ ప్రొఫెసర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవలంబించే విద్యావిధానం వృత్తి నైపుణ్యాన్ని పెంచే విధంగా, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు పోటీ పడేలా ఉండాలని కేసీఆర్ అన్నారు. కేజీ టు పీజీ విద్యావిధానంలో ఏ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలి? ఏ వయస్సు నుండి పిల్లలు హాస్టల్ లో ఉంటే మంచిది? ఉపాధ్యాయులకు సంబంధించి బోధనాంశాలు ఏ విధంగా ఉండాలి? వారికి అదనంగా ఏమైనా శిక్షణ ఇవ్వాలా? అనే అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి రాజయ్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఓఎస్డీ(విద్య) దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.