mt_logo

సాగర్ ప్రక్షాళనకు శ్రమదానం – కేసీఆర్

బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెక్లెస్ రోడ్డు వద్ద జలాశయంలోకి కలుషిత నీరు రావడం వల్ల చుట్టూ దుర్వాసన రావడాన్ని గమనించిన సీఎం సచివాలయంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైదరాబాద్ మెట్రో వర్క్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్ ను అందమైన, పరిశుభ్రమైన సరస్సుగా తీర్చిదిద్దటం కోసం పక్కా ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ హైదరాబాద్ గౌరవం పెంచేలా ఉండాలే కానీ, మురికికూపంగా ఉండొద్దని, ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉన్న హుస్సేన్ సాగర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలనుండి మురుగునీరు సాగర్ లోకి రాకుండా పెద్ద డైవర్షన్ కెనాల్స్ నిర్మించాలని, హుస్సేన్ సాగర్ భూభాగంలో ఆక్రమణలు ఉన్నాయని, వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని కోరారు.

గణేష్ నిమజ్జనం కోసం ఇందిరాపార్క్  లో 20 ఎకరాల విస్తీర్ణంలో సరస్సు నిర్మించాలని, ఆ చెరువుకు వినాయక్ సాగర్ అని పేరు పెట్టి అందులోనే గణేష్, దుర్గామాతల విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనం జరపాలని పేర్కొన్నారు. సాగర్ ప్రక్షాళన కోసం శ్రమదానం నిర్వహించాలని, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, తాను కూడా స్వయంగా పాల్గొంటానని కేసీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *