రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, నిబంధనల ప్రకారమే తెలంగాణ అధికార యంత్రాగం వ్యవహరిస్తున్నప్పటికీ కృష్ణా జలాలపై ఆంధ్రా పార్టీల నేతలు, ఇంజినీర్లు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. లెక్కలు పక్కాగా ఉన్నప్పటికీ తక్కువ నీళ్ళు వస్తున్నాయని, ఈనెల 3 వ తేదీ అర్ధరాత్రి వేళ రెండు పార్టీల నేతలు ఆ ప్రాంతానికి చెందిన ఇంజినీర్ల సాయంతో దొంగతనంగా నీటిని విడుదల చేశారు. అయితే మూడుగంటల పాటు సాగిన నీటిదోపిడీని తెలంగాణ ఉన్నతాధికారులు డ్యాంకు చేరుకొని ఆపివేశారు. అంతేకాకుండా కుడికాల్వకు నీరు తక్కువగా వస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో 7 వేల క్యూసెక్కుల నీరు కుడి కాల్వకు వెళ్తుందో, లేదోనని పరిశీలించడానికి ఎన్నెస్పీ ఎస్ఈ విజయ్ భాస్కర్ రావు, ఈఈ విష్ణు ప్రసాద్ వెళ్ళగా గుంటూరు జిల్లా వైపున్న విజయపురి సౌత్ లో అడుగుపెట్టకుండా టీడీపీ, వైసీపీ నేతలు అడ్డుకుని వెనక్కు పంపారు.
ఇదిలాఉండగా బుధవారం మధ్యాహ్నం సాగర్ డ్యాం ఆనకట్ట కంట్రోల్ రూం కుడికాల్వ పరిధిలోని మాచర్ల ఇన్చార్జి, ఏఈలు, మాచర్ల ఎస్ఐలు సింగయ్య, జయరాం తదితరులు రెండు జీపుల్లో బృందాలుగా వచ్చి కుడికాల్వ నీరు సరిపోవడం లేదని, తక్కువగా వస్తున్నాయని సిబ్బందితో వాగ్వివాదానికి దిగి తాళాలు లాక్కునే ప్రయత్నం చేశారు.
ఈ విషయంపై ఎన్నెస్పీ ఎస్ఈ విజయ్ భాస్కర్ మాట్లాడతూ కుడికాల్వకు నీళ్ళు తక్కువగా వస్తున్నాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరిశీలనకోసం వెళ్లామని, నీళ్ళు తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా వెళ్లి చూడాల్సిన బాధ్యత తమదని, ఇందుకోసం వెళ్తుండగా కుడి ఎర్త్ డ్యాం దాటకుండానే అడ్డుకున్నారని, మా ప్రాంతానికి రావొద్దంటూ గొడవ చేయడంతో వెనక్కు తిరిగి రావాల్సి వచ్చిందని, ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.