రెండుసార్లు వాయిదాపడిన అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విద్యుత్ సమస్యపై మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఏ సమస్యపైనైనా ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని, సభ సజావుగా జరగకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని హరీష్ మండిపడ్డారు. బడ్జెట్ లో ఏ అంశంపైనైనా చర్చకు అవకాశం ఉందని, విద్యుత్ సమస్యపై కూడా మాట్లాడొచ్చని ఆయన సభ్యులకు సూచించారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశం కాబట్టి దీనిపై చర్చించాలని, సభ సజావుగా జరగాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.
సభలో చర్చ జరగకుండా అడ్డుపడుతున్న విపక్షాల తీరుపై ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గత 25 సంవత్సరాలుగా 25 వేలమంది రైతుల ఆత్మహత్యలకు టీడీపీ, కాంగ్రెస్ లే కారణమని అన్నారు. టీడీపీ మూలాలు ఆంధ్రాలో ఉన్నాయని, టీడీపీ సభ్యులు అభివృద్ధి నిరోధకులని, ప్రజాక్షేత్రంలో టీడీపీని ప్రజలు బొందపెద్తారని అన్నారు. వాయిదా తీర్మానాలపై చర్చించాలని కోరిన జానారెడ్డి వ్యాఖ్యలపై ఈటెల స్పందిస్తూ ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి వాయిదా తీర్మానాలపై చర్చించిన దాఖలాలు ఏవీ గతంలో లేవని పేర్కొన్నారు.