mt_logo

రాష్ట్రంలో గురుకుల విద్యావ్యవస్థ కుప్పకూలింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంవత్సరం నుండి తెలంగాణలో విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చనిపోతున్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యావ్యవస్థ కుప్పకూలింది అని మండిపడ్డారు.

కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. గురుకుల విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారు. ఒకే జిల్లాలో మూడు సార్లు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. 28 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గురుకులాల్లో పని చేస్తున్న టీచర్లకు ఆరు నెలల నుండి జీతాలు రావడం లేదు అని దుయ్యబట్టారు.

కేటీఆర్ గురుకుల బాటకు పిలుపునిచ్చారు. గురుకులాల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తాము. గురుకుల బాట పిలుపుతో కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై అవగాహన లేదు. మతిస్థిమితం లేని మంత్రులతో నాపై రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు అని విమర్శించారు.

కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించింది. కొండా సురేఖ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ప్రజలు గుర్తించారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. నేను ప్రభుత్వ హాస్టల్స్‌లో చదువుకుని ఐపీఎస్ అయ్యాను. దేశ రక్షణ కోసం పనిచేశాను. ఏడు సంవత్సరాల సర్వీసును వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. పోలీస్ యూనిఫార్మ్ పక్కన పెట్టి గురుకులాల సెక్రటరీగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను అని గుర్తు చేశారు.

కొండా సురేఖ కుటుంబం గురించి వరంగల్ ప్రజలకు తెలుసు. కొండా కుటుంబానికి నళిని ప్రభాత్ వరంగల్ నడి రోడ్డులో కౌన్సిలింగ్ ఇచ్చారు. గురుకులాలపై రేవంత్ రెడ్డికి, మంత్రులకు శ్రద్ధ లేదు. మంత్రి సీతక్క తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కొండా సురేఖ మత్తులో ఉండి మాట్లాడుతున్నారు అని ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.

గురుకులాలపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. ఆరు నెలల నుండి విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలు లేవు. ఫుడ్ పాయిజన్ గురించి కనీస అవగాహన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేదు. మీకు చేతకాకపోతే విద్యా శాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి అని ఫైర్ అయ్యారు.

నేను తొమ్మిది సంవత్సరాలు గురుకులాల కార్యదర్శిగా ఉన్నా. నా రికార్డ్ సంక్షేమ భవన్‌లో భద్రంగా ఉన్నాయి. అధికారం మీ చేతుల్లో ఉంది. ఎలాంటి విచారణకు అయినా సిద్ధం. ఏసీబీ మీ చేతుల్లోనే ఉంది. తప్పు చేశానని తేలితే జైలుకు వెళ్ళడానికి సిద్ధం. ఉరికంభం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా అని స్పష్టం చేశారు.

ఆకునూరి మురళీ విద్యా కమీషన్ చైర్మన్ కాకముందు ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారు. ఆకునూరి మురళీ ఫుడ్ పాయిజన్‌పై ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగారు.