టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మెట్రో ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే జూపల్లి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు నిరూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమని, నిరూపించకపోతే రేవంత్ రెడ్డి గుండు కొట్టించుకోవాలని, లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబుకు గుండు గీయించాలని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో ఆదివారం సమావేశమైన టీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ, మెట్రో రైలు ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఆరోపణలు రుజువుచేయాలని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి మెట్రోను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఆధారాలు చూపిస్తే ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, సీమాంధ్ర తాబేదారుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పాలమూరు పరువు తీస్తున్నారని, ఆయనొక పచ్చి అబద్ధాల కోరని, ఆరోపణలు నమ్మడానికి ఇక్కడ ప్రజలెవరూ సిద్ధంగా లేరనే సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రామేశ్వర్ రావు వేలంపాటలో భూమిని దక్కించుకున్నారని, దానికి సంబంధించి 32 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారని పేర్కొన్నారు.
ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, పక్కా తెలంగాణ వాది రామేశ్వర్ రావు ఎదుగుదల చూసి ఓర్వలేకే రేవంత్ రెడ్డి ఆయనపై నిందలు వేస్తున్నారని, సీమాంధ్ర బాబుల మోచేతి నీళ్ళు తాగుతూ విచక్షణ కోల్పోయి మాట్లాడటం తగదని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే పాలమూరు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సీమాంధ్ర కమీషన్లకు అలవాటుబడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ గౌరవాన్ని సీమాంధ్ర బాబుల వద్ద తాకట్టు పెడ్తున్నారని ఎమ్మెల్యే బాలరాజు మండిపడ్డారు.
