ఈరోజు సచివాలయంలోని డీ బ్లాకులో రూమ్ నంబరు 345 లో పంచాయితీ రాజ్, ఐటీ శాఖా మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు ఉద్యోగస్తుల ఘనస్వాగతం మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పీఆర్, ఐటీ, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఫ్లోరైడ్ గ్రామాలకు తాగునీరు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి బాధ్యత అని, ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతలు వమ్ముచేయనని, తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రి పదవి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. మంత్రిగా పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తానని, ఐటీఐఆర్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తామని, ఈ 5 సంవత్సరాల్లో 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, 35 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ఈరోజే డీ బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామని, హైదరాబాద్ లో భద్రత కట్టుదిట్టం చేస్తామని, కేసులు వెంటనే పరిష్కారం చేయడానికి సీఐడీని బలోపేతం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులందరికీ సచివాలయంలోని డీ-బ్లాకులో కార్యాలయాలు కేటాయించారు. ఇదిలా ఉండగా ఆర్ధిక మంత్రిగా ఈటెల రాజేందర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 7న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా టీ రాజయ్య పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.