బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ తో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాజన్ కు వివరించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి బ్యాంకుల నుండి పూర్తి సహకారం ఉంటేనే ముందుకు వెళ్ళగలమని, రైతులకు రుణమాఫీ పథకానికి రిజర్వు బ్యాంకు నుండి పూర్తి సహాయ సహకారాలు కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు సంశయిస్తున్నాయని, ఈ విషయంలో సహకరించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాజన్ అభినందిస్తూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం అందించేందుకు చిన్న బ్యాంకులకూ లైసెన్స్ లు ఇస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తమనుండి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా సంప్రదించవచ్చని, రిజర్వు బ్యాంకు పరిధిలో ఉన్నంత మేరకు సహాయం అందించేందుకు తాము సిద్ధమని రాజన్ స్పష్టం చేశారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం సుమారు రూ. 25 వేల కోట్లు అవసరమని, రిజర్వ్ బ్యాంకు నుండి కూడా ఆర్ధిక సాయం అవసరమని ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ కోరగా అందుకు స్పందించిన రాజన్ చెరువుల పునరుద్ధరణకు కూడా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్సి నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.