ఆగస్ట్ 15స్వాతంత్ర్య వేడుకలు గోల్కొండ ఖిల్లాలో నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం స్వయంగా గోల్కొండ కోటకు వచ్చి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. రాణి మహల్ సమీపంలో ఉన్న తారామతి మజీద్ కు పై భాగంలో ఉన్న బాలా-ఈ-హిస్సార్ కింద పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించారు. అక్కడ ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చికబయలులో ఆహ్వానితులు కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 10 నుండి 12 వేల మంది కూర్చోవచ్చునని అధికారులు సీఎం కు తెలిపారు. పంద్రాగస్టు వేడుకలే కాకుండా గణతంత్ర వేడుకలను, ఇతర జాతీయ పండుగలను కూడా ఇక్కడే నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ తో పాటు ఇతర అధికారులు సోమవారం ఉదయం గోల్కొండ కోటకు వచ్చి పరిశీలించారు. సీఎం, మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననుండటంతో సెక్యూరిటీ, పార్కింగ్ అంశాలకు అనుగుణంగా స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పూర్తిగా కోటలోనే నిర్వహించనున్నారు. పతాకావిష్కరణ చేసే సమయంలో చుట్టుపక్కల బురుజులు, ఎత్తైన కట్టడాలపై నుండి కళారూపాలను ప్రదర్శించాలని సీఎం సూచించారు.
ముఖ్యమంత్రి పతాకావిష్కరణ అనంతరం శకటాల ప్రదర్శన కోసం 22శాఖలు అధికారులు సిద్ధంగా ఉంచారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించేలా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే తాము తయారు చేసిన నమూనా శకటాలను సోమవారం సచివాలయంలో అధికారులు సీఎం కేసీఆర్ కు చూపించారు. వాటిని చూసిన ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో శకటాలను అందంగా తీర్చిదిద్దే పనిలో వివిధ శాఖల అధికారులు బిజీగా ఉన్నారు.