-నాడు వ్యవసాయరుణాల మాఫీ అన్నాడు..
-నేడు పంటరుణాలు మాత్రమే అంటున్నాడు
-ఆధార్, ఓటర్ కార్డు సాకుతో 37 లక్షల మందికి రుణమాఫీ నో
-ఈ రోజుకీ పైసా మాఫీ చేయని ఏపీ
-డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అన్నాడు..మనిషికి 10వేలు మాత్రమే అంటున్నాడు..
-10 లక్షలమంది పింఛన్ల తొలగింపు
-ఆత్మహత్యలు చేసుకుంటున్న వయో వృద్ధులు
-యూజ్ అండ్ త్రో పాలసీ మార్చని చంద్రబాబు
-6 నెలల్లో హామీల అర్థాలన్నీ ఫట్
-కండ్లు మూసుకున్న పచ్చ మీడియా
ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే నానుడి ఆయనకు సరిగ్గా సరిపోతుంది. అధికారం కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చేసిన చంద్రబాబు.. అధికారం చేతికి చిక్కిన తర్వాత వాటి అర్థాలను అడ్డదిడ్డంగా మార్చేస్తున్నారు. ఎన్నికల్లో చేసిన బాసలు, హామీలు.. అందలం ఎక్కాక మారిపోతున్నాయి. మ్యానిఫెస్టోలోని అంశాలకు అర్థాలు.. పార్టీ విస్తృతస్థాయి సమావేశం వేదికగా రూపుమార్చుకున్నాయి. అధికారంలోకి రాకముందు రైతురుణాలన్నీ మాఫీ చేస్తామన్న నోటితోనే గురువారం విజయవాడ టీడీపీ సమావేశంలో కేవలం పంటరుణం మాత్రమేనని తెగేసి చెప్పారు.
దీనితో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు హతాశులవుతున్నారు. రైతు రుణమాఫీపై ఇక్కడ టీటీడీపీ నాయకుల తీరు మరోలా ఉంది. నానా యాగీ చేయడమే వారి పాలసీ. ఆ పార్టీ నాయకుడు ఎర్రబెల్లి.. మా నాయకుడు ఏపీలో రైతు రుణాలన్నీ బంగారం రుణాలతో సహా ఏ షరతులూ లేకుండా మాఫీ చేస్తున్నారని గొప్పగా ప్రకటించుకున్నారు. చంద్రబాబు తాజా ప్రకటనతో టీటీడీపీ నాయకులకు ముఖం చెల్లని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఆధార్, ఓటర్‌కార్డు లింకు పెట్టి 37 లక్షల మంది రైతు రుణాలు పెండింగ్‌లో పెట్టారు. ఇవాల్టి లెక్కల ప్రకారం పంట రుణాలకు మాత్రమే అక్కడ మాఫీ వర్తిస్తుంది. ఇంకా బంగారం సంగతేమిటో స్పష్టత లేదు. ఏమైనా చంద్రబాబు తన యూజ్ అండ్ త్రో పాలసీ మరోసారి అమలు చేశారు.
స్వర్ణాంధ్ర అన్నారు.. అన్నీ మాఫీ అన్నారు..
మార్చి 31, 2014న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. తమకున్న అపార అనుభవంతో ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని, 2014 మే 7న ప్రజలు తీసుకునే నిర్ణయం స్వర్ణాంధ్ర ప్రదేశ్‌కు బీజం వేస్తుందని.. బంగారు భవితకు బాటలు వేస్తుందని అందులో పేర్కొన్నారు. అనుభవశూన్యులతో అంతా నష్టమేనని హెచ్చరించారు. దయచేసి ఆలోచించండి.
సరైన నిర్ణయం తీసుకోండి.. స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కండి.. అని కోరారు. ఇది మనందరికీ దశ-దిశ చూపించే ఓ పవిత్ర పత్రం అంటూ మేనిఫెస్టోను గొప్పగా అభివర్ణించారు. ఏ పల్లెకు వెళ్లినా.. ఏ వేదిక ఎక్కినా.. ఏ సభ, సమావేశంలో మాట్లాడినా.. విస్తృత ప్రచారం చేశారు. కరపత్రాలు, టీవీ ప్రకటనలు, పత్రికల్లో యాడ్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.. వాటిని నమ్మిన ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తొలి సంతకంలోనే తుస్సుమనిపించారు.
రుణమాఫీ ప్రకటన మీద సంతకం అనుకుంటే కమిటీ ఏర్పాటు మీద సంతకం చేశారు. తొండి మొదలైంది. వ్యవసాయ, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని.. ఇదేం అసాధ్యమైన పని కాదంటూ పదే పదే చెప్పుకొచ్చిన చంద్రబాబు.. తాజాగా గురువారం విజయవాడ వేదికగా సాగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన ప్రసంగం ఎన్నికల హామీలకు కొత్త అర్థాలు చెప్పింది.. తాను వ్యవసాయ రుణాలు అనలేదని, పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పానని మాట మార్చేశారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్ట నివారణకు రైతు వారీగా భీమాతో పాటు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి నాలిక తిప్పడంపై టీడీపీ నాయకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
హామీ పోయి షరతులు వచ్చె..
నిజానికి రైతు రుణమాఫీ విషయంలో మొదటి నుంచి చంద్రబాబువి దోబూచులాటలే. రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని ఊరూ వాడా ఉదరగొట్టిన చంద్రబాబు.. రుణమాఫీ కోసం వేసిన కమిటీ ఫైలుపై తొలి సంతకం పెట్టారు. మాఫీకి అనేక షరతులు, ఆంక్షలు వచ్చిపడ్డాయి. ఎంత రుణమైనా మాఫీ అన్న నోటితోనే దాన్ని లక్షన్నర అన్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమేనని, ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నా కుటుంబం మొత్తానికి రూ.లక్షన్నర మాత్రమేనని అన్నారు. తాజాగా పంట రుణాలకు మాత్రమేనంటున్నారు.
ఎన్నికల్లో ఇలాంటి షరతులు, ఆంక్షలు చెప్పలేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టంగా రాశారు. ఇక రెండో వైపు భారం తగ్గించుకోవడానికి ఆరు నెలలుగా కసరత్తు సాగుతూనే వచ్చింది.. ఫలితంగా అనేక నిబంధనలు పుట్టుకు వచ్చాయి. వాటి ప్రకారం రుణమాఫీకి ఆధార్ లేక ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 61 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా, ఆధార్ కార్డు లేదని 28 లక్షల మంది రుణమాఫీని పెండింగులో పెట్టారు. ఓటరు గుర్తింపు కార్డు లేదని 9 లక్షల మంది రుణమాఫీని పెండింగులో పెట్టారు. రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదు.
చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తానన్న ధనం ఇప్పటికీ చెల్లించలేదు. ఇదే సమయంలో తెలంగాణలో రుణమాఫీ ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. ఏ లింకూ పెట్టకుండా మొత్తం 19 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసింది. చాలా చోట్ల కొత్త రుణాలు కూడా ఇచ్చారు. ఇస్తున్నారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 90 శాతం మందికి కొత్త రుణాలు ఇచ్చారు. మిగిలిన జిల్లాల్లో 50 శాతం మందికి రుణాలు అందాయి. ఏపీలో మాత్రం రుణ మాఫీ అటుంచితే.. రుణాల రీషెడ్యూల్‌కు నోచుకోకపోవటంతో కొత్త రుణాలు ఆగిపోయాయి. ఆరు నెలలు గడిచినా ఏపీలో ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణం మాఫీ కాలేదు.
ఇప్పుడు మొదటి ఇన్‌స్టాల్ మెంట్ ఇచ్చాక.. తర్వాత రుణాల రీషెడ్యూల్ చేస్తామని చెబుతున్నారు. ఈ రుణమాఫీ ప్రతి సంవత్సరం బ్యాంకుకు జమ చేసి దాన్ని పూర్తిగా తిరిగి చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని.. ఈ నెలాఖరులోగా ఈ హామీని నిలబెట్టుకునే బాధ్యత తీసుకుంటామని అంటున్నారు. ఆరు నెలల్లోపు దీన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పడం ద్వారా ఆరు నెలలు పడుతుందని ఆయనే అంగీకరించారు.
ఆడ పడుచులకు ఊహించని షాక్..
చంద్రబాబు దెబ్బకు దిగ్భ్రాంతికి గురైన వర్గం ఆడపడుచులు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ. బోనస్‌గా తాజాగా లక్ష రుణం అన్నారు ఎన్నికల్లో. ఏరు దాటాక డ్వాక్రా రుణాల మాఫీ సంఘానికి లక్ష మాత్రమేనన్నారు. ప్రతి సభ్యుడికి రూ.10వేలు మించదని అంటున్నారు. ఆయన మాటలు విని రుణాలు చెల్లించకపోవటంతో వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. వాయిదాలు చెల్లించక పాత బకాయిల జాబితాలో పడగా.. తాజాగా సభ్యురాలికి రూ.10వేలు మాఫీ అంటూ కొత్త నాదం ఎత్తుకున్నారు. అదీ తమకు అనుకూలంగా పనిచేసిన సంఘాలకు ముందుగా మాఫీ జాబితాలో పెట్టారు.
రాష్ట్రంలో పింఛన్ల డబ్బును అయిదు రెట్లు పెంచుతున్నానని.. వద్ధులు, వితంతువులు, ఏ ఆసరా లేని వారి కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారతానని చెప్పి.. ఇవాళ పింఛన్లకు సవాలక్ష నిబంధనలు పెట్టేశారు. గతంలో ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లగా అన్ని హామీలపై చర్చించాకే ఇస్తున్నామని, ప్రతి హామీని నెరవేరుస్తామని ఏకంగా ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇప్పుడేమో మాట మార్చి.. తనది రెండు నాల్కల ధోరణి అని నిరూపించుకుంటున్నారు.
రాజధానిపై ఎవరితో చర్చించారు?
చంద్రబాబు గొప్ప ప్రజాస్వామ్యవాది అయినట్టు ఇక్కడ టీటీడీపీ, బీజేపీ నాయకులు గొప్పలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారు. కానీ ఆంధ్రలో ఏమి జరుగుతున్నదో గమనించడం లేదు. రాష్ట్ర విభజనపై తమతో చర్చించలేదని, అన్ని పక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదని నానా రచ్చచేసి, విభజననే అడ్డుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబునాయుడు.. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నగరం ఎంపిక మీద ఎంతమందితో, ఎన్ని పార్టీలతో చర్చలు జరిపారు? అఖిలపక్ష సమావేశం పెట్టారా? శాసనసభలో తీర్మానం చేశారా? కనీసం తెలుగుదేశం శాసనసభాపక్షం సమావేశంలోనైనా చర్చించి తీర్మానించారా? ఇవేవీ చేయకుండానే రాజధాని స్థల నిర్ణయం జరిగిపోయింది. కానీ చిత్రంగా టీటీడీపీ, బీజేపీ నాయకులకు కేసీఆర్‌లో నియంత కనిపిస్తాడు.
పచ్చ మీడియా పైత్య ప్రకోపం..
మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్కోవాగ్దానాన్ని అమలు చేసుకుంటూ పోతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పచ్చ మీడియా విఫల సర్కారుగా చూపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కానీ గత ఆరునెలలుగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నా అయితే చంద్రబాబుకు కానీ, ఆయన పల్లకీ మోస్తున్న పచ్చ పత్రికలకుగానీ అవేవీ కనిపించడం లేదు.
ఒక్క అనంతపురం జిల్లాలోనే ఈ నెలలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. గత ఆరుమాసాల్లో 60 మంది రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏపీలో ఆధార్ లేదని 10 లక్షల మందికి పింఛన్లు కోతపెట్టారు. అంతే కాదు 23 లక్షల మందికి రేషన్ కార్డులు కోతపెట్టారు. చంద్రబాబు భుజకీర్తుల గురించి తెలంగాణ పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురిస్తున్న పత్రికలు ఈ దారుణాలను మాత్రం రంగుల తివాచీ కింద దాచిపెడుతున్నాయి.
రైతు రుణమాఫీపై ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారు?..
తెలుగు దేశం పార్టీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చేస్తాం. ఆర్థిక చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తాం.
– తెలుగుదేశం ఎన్నికల మ్యానిఫెస్టో
జగన్‌కు ఏం తెలుసు? 1995లో జీతాలు చెల్లించలేని స్థితిలోఉన్న రాష్ట్రాన్ని గాడిలో పడేలా అభివృద్ధి చేశాం. ఇప్పుడు కష్టాలున్నాయి. జీతాలివ్వాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చాలి. సంపద సృష్టించాలి. దాన్ని అన్ని రంగాలకు ఉపయోగించాలి. గతంలో సంపద సృష్టించిన చరిత్ర తెదేపాకే ఉంది. మళ్లీ సృష్టిస్తాం… తొలి సంతకం రైతు రుణమాఫీపైనే. రెండో సంతకం డ్వాక్రా రుణమాఫీపై చేస్తాం.
– 14 ఏప్రిల్ 2014, ఈనాడు ఇంటర్వ్యూ
మా ప్రభుత్వం వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తాం. 30 ఏళ్ల అనుభవంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేస్తా.. రైతుల రుణమాఫీ చేస్తానంటే జగన్ ఎలా సాధ్యమని అడుగుతున్నారు.. లక్షల కోట్లు దోచుకోవడం మాత్రమే తెలుసు. రుణమాఫీ ఆయనకెలా తెలుస్తుంది. తాను దోచుకోవచ్చుగాని రైతులకు మేలు జరుగకూడదని భావిస్తున్నాడు.
– 3 మే 2014న విజనగరం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు
ఈరోజు హామీ ఇస్తున్నాను…ఎన్ని అడ్డంకులొచ్చినా సరే రైతుల రుణమాఫీ చేసి తీరతాను. మిమ్మల్ని కాపాడుకుంటాను… పావలా వడ్డీ అన్నారు. వడ్డీకి వడ్డీ కట్టించుకున్నారు. మహిళలను అప్పుల పాలు చేశారు…నా డ్వాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా… మళ్లీ రుణాలను పూర్తిగా మాఫీ చేసి వారిని పైకి తీసుకువస్తాం…
– 5 మే 2014న ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు
పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల బాధలు, ఆవేదనలు చూసి రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ హామీలిచ్చా. అప్పటికి రాష్ట్రం సమైక్యంగా ఉంది. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, ఎంత బడ్జెట్ ఉందో నాకే కాదు ఎవరికీ తెలియని పరిస్థితి. అయినా నా మాటకు కట్టుబడి ఉన్నా. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేస్తా
-18 మే 2014న ఎన్నికల తర్వాత
రైతులు పంటపైన తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాము. ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నా లక్షన్నర రూపాయలు మాఫీ చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చాను….డ్వాక్రా సభ్యులు ప్రతి ఒక్కరికీ 10 వేల రూపాయల చొప్పున రుణ విముక్తి చేస్తామని హామీ ఇచ్చాం.
– గురువారంనాడు విజయవాడలో జరిగిన తెలుగుదేశం రాష్ట్ర సదస్సులో చంద్రబాబు
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..