పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఈరోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో జరిగిన టీ హబ్ ప్రారంభోత్సవంలో పాల్గొని టీ హబ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమమైన ఆలోచనలకు టీ హబ్ సరైన వేదిక అని, నవ భారత నిర్మాణానికి నూతన ఆలోచనలే ఆధారమని అన్నారు. టీ హబ్ ఇండియాకు కొత్త ముఖచిత్రం అవుతుందని రతన్ టాటా ప్రశంసించారు. ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహికులు, ఐటీ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు రతన్ టాటా ఈ సందర్భంగా సమాధానాలు చెప్పారు.
అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ టీ హబ్ బిల్డింగ్ ను చూసి తాను ఆశ్చర్యపోయానని, టీ హబ్ రాష్ట్ర భవిష్యత్ కు బాటలు వేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉత్తమ ఆలోచన పరులున్నారని, టీ హబ్ సేవలు గ్రామీణ ప్రాంత ఆలోచనాపరులకు చేరేలా చూడాలని సూచించారు. నూతన ఆలోచనలకు టీ హబ్ ట్రెండ్ సెట్టర్ అవుతుందని, ప్రభుత్వ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందనని గవర్నర్ నరసింహన్ అభినందించారు.