తెలంగాణలో భూగర్భ జలాలు ఆందోళకరమైన స్థాయికి పడిపోయాయి. నగరం, ఊరు అనే తేడా లేకుండా తాగు నీటికి, గ్రామాల్లో సాగునీటికి కటకట ఏర్పడింది. ఈ వర్షాకాలంలో వాన నీటి సంరక్షణ ప్రాధాన్యతను మీకు మరోసారి గుర్తు చేసేందుకు ఈ ప్రయత్నం.
హైదరాబాదులో దాదాపు 1500 అడుగుల బోర్లు వేసినా చుక్క నీరు దొరకని పరిస్థితి వచ్చింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ప్రతి వర్షాకాలం ప్రకృతి మనకు సరిపోయే నీటిని ఇస్తున్నా, మనం ఆ నీటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయడం లేదు.
గత పది రోజుల్లో ఒక్కో ఇంటిపై కురిసిన వర్షం నీటిని కనుక మనం సంరక్షించుకోగలిగితే కుటుంబానికి ఇరవై రోజులకు సరిపడా నీరు దొరికేది.
హైదరాబాదు లాంటి నగరాల్లో ఏడాదికి 780 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు అవుతుంది. ఒక 100 చదరపు అడుగుల ప్లాటులో, ఏడాది కాలంలో కురిసేవర్షం నీరు దాదాపు 55000 లీటర్లు ఉంటుంది. ఈ నీటినే కనుక మనం ఆదా చేసుకోగలిగితే అయిదుగురు సభ్యులున్న కుటుంబానికి 100 రోజులపాటు సరిపోతుంది.
వర్షాకాలంలో పడే వాన నీటిని భూమిలోకి ఇంకేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే మనకు ఎండాకాలంలోనూ సరిపడా నీరు లభ్యం అవుతుంది. ఇంకుడు గుంత ఏర్పాటు చేయడం చాలా స్వల్ప ఖర్చుతో కూడుకున్న పని. మీ ఇంటిలో ఎండిపోయిన బోర్ వెల్ కానీ, బావి కానీ ఉన్నట్టయితే మీరు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవడం ఇంకా సులభం.
ఇప్పటికైనా మనం మేలుకొని ప్రతి ఇంటిలోను, అపార్ట్ మెంటులోను వాన నీటి సంరక్షణ కొరకు ఇంకుడు గుంతలు తవ్వించకపోతే భవిష్యత్ అంధకారం అయ్యే ప్రమాదం ఉంది.
(సాగు నీటి అవసరాల కొరకు వాన నీటిని ఎట్లా సంరక్షించుకోవాలో రేపు చూద్దాం)